శ్రీ రఘురామ! చారుతుల-సీతాదళధామ శమక్షమాది శృం
గార గుణాభిరామ! త్రిజ-గన్నుత శౌర్య రమాలలామ దు
ర్వార కబంధరాక్షస వి-రామ! జగజ్జన కల్మషార్నవో
త్తారకనామ! భద్రగిరి-దాశరధీ కరుణాపయోనిధీ
భావం: రఘువంశమున బుట్టినవాడవు, సొంపైన తులసీదండలు గలవాడవు, శాంతి, ఓరిమి మొదలు గుణములచే నొప్పువాడవు, ముల్లోకముల బొగడదగిన పరాక్రమలక్ష్మికి ఆభరణమైనవాడా! వారింపనలవికాని కబంధుడను రాక్షసుని సంహరించినవాడా, జనుల పాపములను సముద్రమును దాటించు నామము గలవాడా! దయకు సముద్రమువంటివాడా! భద్రాచలమందుండు శ్రీరామా!
రామవిశాల విక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ
స్తోమ పరాంగనావిముఖ సువ్రత కామ వినీల నీరద
శ్యామ కకుత్ధ్సవంశ కలశాంభుధిసోమ సురారిదోర్భలో
ద్ధామ విరామ భద్రగిరి - దాశరధీ కరుణాపయోనిధీ!
భావం: జనులను సంతోషింపజేయువాడవు, పరశురాముని జయించినవాడవు, పరస్రీలయందాసక్తి లేనివాడవు, నల్లని మేఘమువంటి శరీర కాంతిగలవాడవు, కాకుత్ స్థ వంశమును సముద్రమునకు చంద్రునివంటి వాడవు, రాక్షసుల సంహరించిన వాడవునైన భద్రాచల రామా!
అగణిత సత్యభాష, శరణాగతపోష, దయాలసజ్ఘరీ
విగత సమస్తదోష, పృథివీసురతోష, త్రిలోక పూతకృ
ద్గగ నధునీమరంద పదకంజ విశేష మణిప్రభా ధగ
ద్ధగిత విభూష భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: సత్యము మాట్లాడువాఁడవు, శరణన్న వారిని రక్ష్మించువాడవు, దయచేతఁ బాపములఁ బోగొట్టువాడవు, బ్రాహ్మణుల సంతోషింపజేయువాడవు, గంగానది పుట్టిన పాదపద్మములు గలవాడవు, మణులచే నిగ నిగ మెఱయు సొమ్ములు గలవాడవు, భద్రాచల రామా!
రంగదరాతిభంగ, ఖగ రాజతురంగ, విపత్పరంపరో
త్తుంగ తమఃపతంగ, పరి తోషితరంగ, దయాంతరంగ స
త్సంగ ధరాత్మజా హృదయ సారసభృంగ నిశాచరాబ్జమా
తంగ, శుభాంగ, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిథీ.
భావం: శత్రువుల సంహరించినవాడవు, గరుత్మంతుడు వాహనముగ గలవాడవు, ఆపదల బోగొట్టువాడవు, రంగనాధునిచే సేవింపబడిన వాడవు, దయతో నొప్పు మనస్సుగలవాడవు, సత్సంగుడవు, సీతాహృదయమును పద్మమునకు తుమ్మెదవంటివాడవు, రాక్షసులకు బీభత్స కరుడవు, శుభాంగుడవునైన భద్రాచల రామా!
శ్రీద సనందనాది మునిసేవిత పాద దిగంతకీర్తిసం
పాద సమస్తభూత పరిపాల వినోద విషాద వల్లి కా
చ్ఛేద ధరాధినాథకుల సింధుసుధామయపాద నృత్తగీ
తాది వినోద భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: సంపదల నిచ్చువాడవు, మునులచే బూజింపబడినవాడవు, కీర్తిమంతుడవు, అన్ని భూతములను పాలించువాడవు, దుఖఃముల బోగొట్టువాడవు, క్షత్రియ కులమును సముద్రమునకు జంద్రుడవు, నృత్యము, గానము వేడుకగా గలవాడవు, భద్ర - నిధీ!
ఆర్యుల కెల్ల మ్రొక్కివిన తాంగుడనై రఘునాధ భట్టరా
రార్యుల కంజలెత్తి కవి సత్తములన్ వినుతించి కార్య సౌ
కర్య మెలర్పనొక్క శతకంబొన గూర్చి రచింతునేడుతా
త్పర్యమునన్ గ్రహింపుమిది దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: పెద్దల కందఱికి మ్రొక్కి, వంచిన శరీరము గలవాడనై గురువైన రఘునాధభట్టునకు నమస్కరించి, కవిశ్రేష్ఠులను పొగడి, కార్య లాభమునకై యొక శతకంబును వ్రాసెదను. దీని నిష్టముతో గైకొనుము దాశ - నిధీ!
మసకొని రేంగుబండ్లుకును మౌక్తికముల్ వెలవోసినట్లుదు
ర్వ్యసనముజెంది కావ్యము దురాత్ములకిచ్చితిమోస మయ్యె నా
రసనకుఁ బూతవృత్తిసుక రంబుగ జేకురునట్లు వాక్సుధా
రసములుచిల్క బద్యుముఖ రంగమునందునటింప వయ్యసం
తసము జెంది భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: రేగుపండ్లను ముత్తెములుపోసి కొనినట్లు దురాశతో మోసపోయి నా కావ్యములను దుర్మార్గుల కిచ్చితిని; నా నాల్కకు పవిత్రత సులభముగ గల్గునట్లును, పలుకుదేనియలు చిల్కునట్లు నా పద్యము ముఖమును నాట్యరంగమునందు సంతోషముతో నీవు నటింపుము. భద్ర - నిధీ!
శ్రీరమణీయహార యతసీ కుసుమాభశరీర, భక్త మం
దార, వికారదూర, పరతత్త్వవిహార త్రిలోక చేతనో
దార, దురంత పాతక వితాన విదూర, ఖరాది దైత్యకాం
తార కుఠార భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: హారములు గలవాడవు, అవిసెపూవువంటి శరీరకాంతి గలవాడవు, భక్తులకు కల్పవృక్షమవు, వికారములు లేనివాడవు, దేవతాతత్త్వమందు విహరించువాడవు, మూడులోకముల గల ప్రాణులను బోషించువాడవు, పాపముల బోగొట్టువాడవు, ఖరాది రాక్షసారణ్యమునకు గొడ్డలివంటి వాడవు, భద్ర - నిధీ!
దురితలతాలవిత్ర, ఖర దూషణకాననవీతిహొత్ర, భూ
భరణకళావిచిత్ర, భవ బంధవిమోచనసూత్ర, చారువి
స్ఫురదరవిందనేత్ర, ఘన పుణ్యచరిత్ర, వినీలభూరికం
ధరసమగాత్ర, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: పాపమను తీగలకు కొడవలివంటివాడవు, ఖరదూషణాదుల నెడి యడవికి యగ్నివంటివాడవు, భూమిని రక్షించుటయందు విచిత్రుడవు, పుట్టుకయను ముడిని విడదీయుటయే విధిగాగలవాడవు, ప్రకాశించు పద్మములవంటి నేత్రములు గలవాడవు, పుణ్యచరిత్రుడవు, మేఘకాంతి వంటి శరీరకాంతి గలవాడవు.
కనకవిశాలచేల భవకానన శాతకుఠారధార స
జ్జనపరిపాలశీల దివిజస్తుత సద్గుణ కాండకాండ సం
జనిత పరాక్రమక్రమ విశారద శారద కందకుంద చం
దన ఘనసార సారయశ దాశరథీ కరుణాపయోనిధీ. 10
భావం: బంగారు మయమైన వస్త్రములు గలవాడవు, సంసారమను నడవికి గొడ్డలి మొనవంటివాడవు, సజ్జనుల పరిపాలించెడివాడవు, దేవతలచే బొగడబడినవాడవు, మంచి గుణములు గలవాడవు, బాణవిద్యలో బండితుండవు, శరత్కాలపు మేఘము, మొల్లలు, గంధము పచ్చ కర్పూరము వంటి నిగ్గైన కీర్తిగలవాడవు.
శ్రీ రఘువంశ తోయధికి శీతమయూఖుడవైన నీ పవి
త్రోరుపదాబ్జముల్ వికసితోత్పల చంపక వృత్తమాధురీ
పూరితవాక్ప్రసూనముల బూజలొనర్చెద జిత్తగింపుమీ
తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ
భావం: రఘువంశమునకు జంద్రునివంటివాడవు, అట్టి నీ చరణముల నుత్పలము, చంపకము మొదలగు పద్యవృత్తములను పూలచే బూజించును. నా పూజలను గైకొనుము.
గురుతరమైన కావ్యరస గుంభనకబ్బుర మందిముష్కరుల్
సరసులమాడ్కి సంతసిల జూలుదురోటుశశాంక చంద్రికాం
కురముల కిందు కాంతమణి కోటిస్రవించిన భంగివింధ్యభూ
ధరమున జాఱునే శిలలు దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: మూఢులు గ్రంధములలోని రసముయొక్క కూర్పునకు రసికుల వలె సంతోషింపజాలరు. ఎట్లన చంద్రుని వెన్నెలకు చంద్రకాంత శిలలు కఱగి జాఱునట్లు వింధ్యపర్వతమున నుండు ఱాళ్ళు జాఱవు.
తరణికులేశ నానుడుల దప్పులు గల్గిన నీదునామ స
ద్విరచితమైన కావ్యము పవిత్రముగాదె వియన్నదీజలం
బరగుచువంకయైన మలినాకృతి బాఱిన దన్మహత్వముం
దరమె గణింప నెవ్వరికి దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: నా మాటలలో దప్పులున్నను నీ పేరుతో వ్రాయబడు కావ్యము పవిత్రమైనదే, ఎట్లన గంగానది నీరు వంకరగ బాఱినను, ముఱికిగ మాఱినను దాని గొప్పతన మెక్కడ పోవును?
దారుణపాత కాబ్ధికి సదా బడబాగ్ని భవాకులార్తివి
స్తారదవానలార్చికి సుధారసవృష్టి దురంత దుర్మతా
చారభయంక రాటవికి జండకఠోరకుఠారధార నీ
తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: నీ పేరు పాపమను సముద్రమునకు బడబాగ్ని వంటిది, సంసారమను కార్చిచ్చునకు నమృతపు వాన, దుర్మతాచారములకు గొడ్డలి మొన వంటిది.
హరునకు నవ్విభీషణునక ద్రిజకుం దిరుమంత్ర రాజమై
కరికి సహల్యకుం ద్రుపదకన్యకు నార్తిహరించుచుట్టమై
పరగినయట్టి నీపతిత పావననామము జిహ్వపై నిరం
తరము నటింపజేయుమిక దాశరథీ కరుణాపయోనిధీ
భావం: నీ నామ మీశ్వరునకు, విభీషణునకు, పార్వతికిని శ్రేష్ఠమగు మంత్రమైనది. అట్టి పరమ పవిత్రమైన నీ నామము నా నాల్కయం దెప్పుడు నాడునట్లు చేయుము.
ముప్పున గాలకింకరులు ముంగిటవచ్చిన వేళ, రోగముల్
గొప్పరమైనచో గఫము కుత్తుక నిండినవేళ, బాంధవుల్
గప్పినవేళ, మీస్మరణ గల్గునొ గల్గదొ నాటి కిప్పుడే
తప్పకచేతు మీభజన దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: ముసలితనమున యమభటులు వాకిట ముందునకు వచ్చి యుండగా, రోగ మెక్కువై కఫము గొంతులో నిండినప్పుడు, బంధువులు చుట్టుకొన్నప్పుడు మిమ్ము తలతునో తలపలేనో, భజింతునో భజింపలేనో కాబట్టి యిప్పుడే యా పని నెరవేర్చెదను.
పరమదయానిధే పతితపావననామ హరే యటంచు సు
స్ధిరమతులై సదాభజన సేయు మహత్ముల పాదధూళి నా
శిరమునదాల్తుమీరటకు జేరకుడంచు యముండు కింకరో
త్కరముల కాన బెట్టునట దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: దయకు సముద్రమువంటివాడవు, పాపులనుద్ధరించు పేరుగలవాడవు. హరీ యని నిలుకడగల బుధ్ధితో గొలుచు మహాత్ముల కాళ్ళ దుమ్ము నా నెత్తిపై దాల్తును. అప్పుడు యముడు తన భటులను నా జోలికి పోవద్దని యాజ్ఞాపించును.
అజునకు తండ్రివయ్యు సనకాదులకుం బరతత్త్వమయ్యుస
ద్ద్విజమునికోటికెల్లబర దేతవయ్యు దినేశవంశ భూ
భుజులకు మేటివయ్యుబరి పూర్ణుడవై వెలిగొందుపక్షిరా
డ్ధ్వజమిము బ్రస్తుతించెదను దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: బ్రహ్మకు దండ్రివి, సనకాదులకున్ బరతత్త్వమవు, బ్రాహ్మణులకు, ఋషులకు ముఖ్య దేవుడవు, సూర్యవంశపు రాజులలో నధికుడవు, అట్టి నిన్ను పొగడెదను.
పండిత రక్షకుం డఖిల పాపవిమొచను డబ్జసంభవా
ఖండల పూజితుండు దశకంఠ విలుంఠన చండకాండకో
దండకళా ప్రవీణుడవు తావక కీర్తి వధూటి కిత్తుపూ
దండలు గాగ నా కవిత దాశరధీ కరుణాపయోనిధీ!
భావం: పండిత రక్షకుఁడు, పాపములఁ బోఁగొట్టువాఁడు, బ్రహ్మేంద్రాదులచే బూజింపఁబడినవాఁడు, రావణాసురిని సంహరించినవాడను నీ కీర్తి కన్యకు నా కవిత్వమును బూదండవలెనిత్తును.
శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవా
చార జవంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠ ము
న్నారయభద్ర శైలశిఖరాగ్రముగాగ వసించు చేతనో
ద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధీ. 20
భావం: లక్ష్మీదేవి సీత, సేవకులు వైష్ణవజనులు, విరజానది, గోదావరి, వైకుంఠము, భద్రాచలము కాగా ప్రాణుల నుధ్ధరించునట్టి విష్ణువుడ నీవు దా - నిధీ!
కంటి నదీతటంబుబొడగంటిని భద్రనగాధివాసమున్
గంటి నిలాతనూజనురు కార్ముక మార్గణశంఖచక్రముల్
గంటిని మిమ్ము లక్ష్మణుని గంటి కృతార్ధుడ నైతి నో జగ
త్కంటక దైత్యనిర్ధళన దాశరధీ కరుణాపయోనిధీ!
భావం: ఏటిదరిని భద్రాచలమునం దుండుట జూచితిని, సీతను జూచితిని, గొప్పవైన ధనువును, బాణములను, శంఖచక్రముల జూచితిని, మిమ్ము, లక్ష్మణుని జూచి కృతార్ధుడనైతి.
హలికునకున్ హలాగ్రమున నర్ధము సేకురుభంగి దప్పిచే
నలమట జెందువానికి సురాపగలో జల మబ్బినట్లు దు
ర్మలిన మనోవికారియగు మర్త్యుని నన్నొడగూర్చి నీపయిన్
దలవు ఘటింపజేసితివె దాశరధీ కరుణాపయోనిధీ!
భావం: రైతునకు నాగేటి చివర ధనమిచ్చినట్లును, దప్పితో బాధ పడువానికి గంగానదీజల మబ్బినట్లును, చెడు మనస్సు గల నాకు నీపై భక్తి కలుగునట్లు చేసితివి.
కొంజకతర్క వాదమను గుద్దలిచే బరతత్త్వభూస్ధలిన్
రంజిలద్రవ్వి కన్గొనని రామనిధానము నేడు భక్తిసి
ద్ధాంజనమందుహస్తగత మయ్యెబళీ యనగా మదీయహృ
త్కంజమునన్ వసింపుమిక దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: తర్కవాదముచేనైన గన్గొనరాని రాముడను నిధి, భక్తియను బైరాగుల కాటుకతో నందఱు సెబాసనగా జేజిక్కిన దయ్యెను. ఇంక నా మనస్సునందు స్థావరముగా నిలువుము.
రాముఁడు ఘోర పాతక విరాముడు సద్గుణకల్పవల్లికా
రాముడుషడ్వికారజయ రాముడు సాధుజనావనవ్రతో
ద్దాముఁడు రాముడే పరమ దైవము మాకని మీ యడుంగు గెం
దామరలే భుజించెదను దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: పాపములను పోగొట్టువాడు, మంచిగుణములను కల్పవృక్షపు తీగెలకు దోటవంటివాడు, వికారములను జయించినవాడు, మంచివారిని రక్షించువాడు నైన రాముడే ముఖ్య దేవుడుగా నీ యడుగు లను పద్మముల గొలుతును.
చక్కెరమానివేముదిన జాలినకైవడి మానవాధముల్
పెక్కురు ఒక్క దైవముల వేమఱుగొల్చెదరట్ల కాదయా
మ్రొక్కిననీకు మ్రొక్కవలె మోక్ష మొసంగిన నీవయీవలెం
దక్కినమాట లేమిటికి దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: హీనులనేకులు నిన్ను విడిచి ఇంకొకరిని గొలిచెదరు. అనగా తియ్యని చక్కెరను తినలేక వేప వస్తువగు చేదును తినుటకు నేర్చినట్లున్నది.మ్రొక్క దగినవాడవు నీవే , మోక్షదాయకుడవు నీవే !
'రా' కలుషంబులెల్ల బయలంబడద్రోచిన 'మా'క వాటమై
డీకొనిప్రోవుచునిక్క మనిధీయుతులెన్నఁదదీయ వర్ణముల్
గైకొని భక్తి చే నుడువఁగానరు గాక విపత్పరంపరల్
దాకొనునే జగజ్జనుల దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: 'రా' యను నక్షరము పాపముల బారద్రోలగా, 'మా' యను నక్షరము వాకిలియై పాపముల జొరనీయకుండును అని పెద్దలైనవారు పై 'రామ' యను నక్షరముల బుద్ధిమంతులు భక్తితో బలుకకుందురే గాని, పలికినట్లైన యాపదలు ప్రపంచ జనుల గ్రమ్ముకొనవు.
రామహరే కకుత్ధ్సకుల రామహరే రఘురామరామశ్రీ
రామహరేయటంచు మది రంజిల భేకగళంబులీల నీ
నామము సంస్మరించిన జనంబు భవంబెడబాసి తత్పరం
ధామ నివాసులౌదురట దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: రామ హరే యని నీ పేరును గప్ప గొంతుకవలె దలఁచిన జనులు జన్మరహితులై మోక్షము జెందుదురట.
చక్కెర లప్పకున్ మిగుల జవ్వని కెంజిగురాకు మోవికిం
జొక్కపుజుంటి తేనియకు జొక్కులుచుంగన లేరు గాక నే
డక్కట రామనామమధు రామృతమానుటకంటె సౌఖ్యామా
తక్కినమాధురీ మహిమ దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: అయ్యో! ఈ కాలమువారు చక్కెరరాశికిని, యువతి యొక్క పెదవికిని, తేనెటీగలు పెట్టిన తేనెకు నాసపడుచున్నారు. రాముని పేరులో గల తీపిని నెఱుంగలేరు. రాముని పేరులో గల తీయదనము కంటే వానిలో గల తీయదన మంత సుఖమా!
అండజవాహ నిన్ను హృదయంబుననమ్మిన వారి పాపముల్
కొండలవంటివైన వెసగూలి నశింపక యున్నె సంత తా
ఖండలవైభవోన్నతులు గల్గకమానునె మోక్ష లక్ష్మికై
దండయొసంగకున్నె తుద దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: నిన్ను నమ్మి కొలిచినవారి పాపములు కొండలంతటివైనను నశించిపోవును. ఇంద్రవైభవములు కల్గును. మోక్షలక్ష్మి చేయూతనొసంగును.
చిక్కనిపాలపై మిసిమి జెందిన మీగడ పంచదారతో
మెక్కినభంగి మీవిమల మేచకరూప సుధారసంబు నా
మక్కువ పళ్లేరంబున సమాహిత దాస్యము నేటిదో యిటన్
దక్కెనటంచు జుఱ్ఱెదను దాశరథీ కరుణాపయోనిధీ. 30
భావం: చిక్కని పాలిమీద నిగనిగలాడు మీగడతో జక్కెర గలిపికొని తిన్నట్లుగ నీ రూప మనియెడు నమృతము నా ప్రేమ పాత్రలో దగిన దాస్యమును దోసిలియందు లభించిందని చెప్పి జుఱ్ఱుకొందును.
సిరులిడసీత పీడలెగ జిమ్ముటకున్ హనుమంతుడార్తిసో
దరుడు సుమిత్రసూతి దురితంబులుమానుప రామ నామముం
గరుణదలిర్ప మానవులగావగ బన్నిన వజ్రపంజరో
త్కరముగదా భవన్మహిమ దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: సంపద లిచ్చుటకు సీత, పీడల పోగొట్టుటకు హనుమంతుడు, ధుఃఖముబాప లక్ష్మణుడు పాపము హరించుటకు రామనామములను గరుణతో మానవుల రక్షిచుటకై యేర్పరుపబడినవి.
హలికులిశాంకుశధ్వజ శరాసన శంఖరథాంగ కల్పకో
జ్వలజలజాత రేఖలను సాంశములై కనుపట్టుచున్న మీ
కలితపదాంబుజ ద్వయము గౌతమపత్ని కొసంగినట్లు నా
తలపున జేర్చికావగదె దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: శంకచక్రాదులతో బ్రకాశించు పద్మరేఖల వలె చిహ్నములు గలవైన మీ పాదముల నహల్య కొసగినట్లు నా భామునందు గూడ నిలుచునట్లు చేయును.
జలనిధిలోనదూఱి కుల శైలముమీటి ధరిత్రిగొమ్మునం
దలవడమాటిరక్కసుని యంగముగీటిబలీంద్రునిన్ రసా
తలమునమాటి పార్ధివక దంబముగూఱ్చిన మేటిరామ నా
తలపుననాటి రాగదవె దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామాద్యవతారముల నెత్తినట్టి రామా! నా భావమునందు నిలువగా రమ్ము.
భండన భీముడా ర్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణకో
దండకళాప్రచండ భుజ తాండవకీర్తికి రామమూర్తికిన్
రెండవ సాటిదైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా
దాండద దాండ దాండ నిన దంబులజాండము నిండమత్తవే
దండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: యుద్ధమునందు భయంకరుడు, దుఃఖితులకు జుట్టము, ధనుర్విద్యయందును, భుజబలము నందును పేరు గన్న రాముని వంటి దేవుడింకొకడు లేడు. ఈ విషయము నేను లోకమునకు జాటెదను.
అవనిజ కన్నుదోయి తొగలందు వెలింగెడు సోమ, జానకీ
కువలయనేత్ర గబ్బిచనుకొండల నుండు ఘనంబ మైధిలీ
నవనవ యౌవనంబను వనంబుకున్ మదదంతి వీవెకా
దవిలి భజింతు నెల్లపుడు దాశరధీ కరుణాపయోనిధీ!
భావం: సీత కన్నులను కలువలకు జంద్రుడవు, సీత యొక్క యుబ్బిన స్తనములను కొండల నుండెడి మేఘమవు. సీత యొక్క కొంగ్రొత్త యౌవన మను వనమునకు మదించిన యేనుగువంటివాడవు నీవని యిష్టముతో గొలుతును.
ఖరకరవంశజా విను ముఖండిత భూతపిశాచఢాకినీ
జ్వర పరితాపసర్పభయ వారకమైన భవత్పదాబ్జ ని
స్పుర దురువజ్రపంజరముజొచ్చితి, నీయెడ దీన మానవో
ధ్ధర బిరుదంక మేమఱుకు దాశరధీ కరుణాపయోనిధీ!
భావం: భూత పిశాచాది భయముల బోగొట్టునవైన నీ పాదముల బ్రవేశించితిని. ఇపుడు దీనుల నుద్ధరించువాడవను నీ బిరుదు యొక్క చిహ్నము మఱవకుము.
జుఱ్ఱెదమీక థామృతము జుఱ్ఱెదమీపదకంజతో యమున్
జుఱ్ఱెద రామనామమున జొబ్బిలుచున్న సుధారసంబ నే
జుఱ్ఱెద జుఱ్ఱుజుఱ్ఱుఁగ రుచుల్ గనువారిపదంబు గూర్పవే
తుఱ్ఱులతోడి పొత్తిడక దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: మీ కధామృతమును మీ పాదపద్మములను జుఱ్ఱుకొందును. రామనామములో గారుచున్న యమృతరసమును జుఱ్ఱెదను. అందలి రుచుల నెఱిగినవారి స్థానమిమ్ము. దుర్మార్గుల స్నేహ మొసగకుము.
ఘోరకృతాంత వీరభట కోటికి గుండెదిగుల్ దరిద్రతా
కారపిశాచ సంహరణ కార్యవినోది వికుంఠ మందిర
ద్వార కవాట భేది నిజదాస జనావళికెల్ల ప్రొద్దు నీ
తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: నీ నామము యమభటులకు గుండె దిగులు కలిగించునది, దరిద్ర పిశాచమును నాశనము చేయునది. నీ భక్తుల కెప్పటికిని వైకుంఠ ద్వారమున గల తలుపులను బ్రద్దలు గొట్టునటువంటిది.
విన్నపమాలకించు రఘువీర నహిప్రతిలోకమందు నా
కన్నదురాత్ముడుం బరమ కారుణికోత్తమ వేల్పులందు నీ
కన్న మహాత్ముడుం బతిత కల్మషదూరుడు లేడునాకువి
ద్వన్నుత నీవెనాకు గతి దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: నాకన్న దురాత్ముడు ప్రపంచమున లేడు. నీకన్న మహాత్ముడు దేవతలలో లేడు. కావున నాకు నీవె దిక్కు. మరియొకరు కాదు.
పెంపునఁదల్లివై కలుష బృందసమాగమ మొందుకుండు ర
క్షింపనుదండ్రివై మెయు వసించుదు శేంద్రియ రోగముల్ నివా
రింపను వెజ్జవై కృప గుఱించి పరంబు దిరబుగాఁగ స
త్సంపదలీయ నీవెగతి దాశరథీ కరుణాపయోనిధీ. 40
భావం: పోషించుటలో దల్లివి, పాపముల బొందకుండ రక్షించుటలో దండ్రివి, రోగమును వారించుటలో వైద్యుడవై, దయతో శాశ్వతమోక్ష మొసగి రక్షింపుము.
కుక్షినజాండపం క్తులొన గూర్చి చరాచరజంతుకోటి సం
రక్షణసేయు తండ్రివి పరంపర నీ తనయుండనైన నా
పక్షము నీవుగావలదె పాపము లెన్ని యొనర్చినన్ జగ
ద్రక్షక కర్తవీవెకద దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: కడుపులో బ్రహ్మాండముల నుంచుకొని చేతనా చేతన జంతువుల బాలించు నీవే నాకు దిక్కు. పాపములెన్ని చేసినను రక్షించు వాడవు నీవే సుమా!
గద్దరియో గిహృత్కమల గంధర సానుభవంబుఁజెందు పె
న్నిద్దవు గండుఁ దేఁటి థరణీసుత కౌఁగిలిపంజరంబునన్
ముద్దులుగుల్కు రాచిలుక ముక్తినిధానమురామరాఁగదే
తద్దయు నేఁడు నాకడకు దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: మహాత్ముల హృదయ పద్మములనుండు మకరందమును గ్రోలుదుమ్మెదవంటివాడవు, ముక్తికి నిక్షేపమువంటివాడవు నైన, రామ! నేడు దయతో నా కడకు రమ్ము.
కలియుగ మర్త్యకోటినిను గన్గొన రానివిధంబో భక్తవ
త్సలతవహింపవో చటుల సాంద్రవిపద్దశ వార్ధి గ్రుంకుచో
బిలిచిన బల్క వింతమఱపీ నరులిట్లనరాదు గాక నీ
తలపున లేదె సీత చెఱ దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: ఈ కలియుగములోని మనుష్యులు నిన్ను గనలేకున్నారో లేక నీకు భక్తులపై దయలేదో యెఱుంగను. మిక్కిలి విశేషమైన యాపద లను సముద్రములో బడుచు బిలిచినను బలుకకున్నావు. మే మిట్లనగూడదు, సీత పడిన బాధ నప్పుడే మఱచితివా? (మమ్ములను మఱువకు మనుట.)
జనవర మీక థాలి వినసైఁపక కర్ణములందు ఘంటికా
నినద వినోదముల్ సులుపునీచునకున్ వరమిచ్చినావు ని
న్ననయమునమ్మి కొల్చిన మహాత్మునకేమి యొసంగు దోసనం
దననుత మాకొసంగుమయ దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: నీ కధలు చెవులతో విన నిష్టపడక గంటలమ్రోఁతల నానందపడు ఘంటాకర్ణాదులకు వరము లిచ్చితివి. నిన్నెప్పుడుఁ గొల్చువారి కే మోసంగితివి. మాకు మోక్ష మిమ్ము.
పాపము లొందువేళ రణపన్నగ భూత భయజ్వారాదులన్
దాపద నొందువేళ భరతాగ్రజ మిమ్ము భజించువారికిన్
బ్రాపుగ నీవుదమ్ము డిరుపక్కియలన్ జని తద్విత్తి సం
తాపము మాంపి కాతురట దాశరధీ కరుణాపయోనిధి!
అగణిత జన్మకర్మదురి తాంబుధిలో బహుదుఃఖవీచికల్
దెగిపడవీడలేక జగతీధర నీపదభక్తి నావచే
దగిలి తరింపగోరితి బదంపబడి నదు భయంభు మాన్పవే
తగదని చిత్తమం దిడక దాశరధీ కరుణాపయోనిధీ!
నేనొనరించు పాపముల నేకములైనను నాదుజిహ్వకుం
బానకమయ్యెమీపరమ పావననామముదొంటి చిల్కరా
మాననుగావుమన్న తుది మాటకు సద్గతి జెందెగావునన్
దాని ధరింపగోరెదను దాశరథీ కరుణాపయోనిధీ.
పరధనముల్ హరించి పరభామలనంటి పరాన్న మబ్బినన్
మురిపమ కానిమీఁదనగు మోసమెఱుంగదు మానసంబు
స్తరమదికాలకింకర గదాహతి పాల్పడనీక మమ్ము నేదు
తఱిదరిజేర్చి కాచెదవొ దాశరథీ కరుణాపయోనిధీ.
చేసితి ఘోరకృత్యములు చేసితి భాగవతాపచారముల్
చేసితి నన్యదైవములఁ జేరి భజించిన వారిపొందు నేఁ
జేసిన నేరముల్ దలఁచి చిక్కులఁబెట్టకుమయ్యయయ్య నీ
దాసుఁడనయ్య భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.
పరుల ధనంబుఁజూచిపర భామలజూచి హరింపగోరు మ
ద్గురుతరమానసం బనెడు దొంగనుబట్టినిరూఢదాస్య వి
స్ఫురితవివేక పాశములఁ జుట్టి భవచ్చరణంబనే మరు
త్తరువునగట్టివేయగ దె దాశరథీ కరుణాపయోనిధీ. 50
సలలిత రామనామ జపసార మెఱుంగను గాశికాపురీ
నిలయుడగానుమీచరణ నీరజరేణు మహాప్రభావముం
దెలియనహల్యగాను జగతీవర నీదగు సత్యవాక్యముం
దలపగ రావణాసురుని తమ్ముడగాను భవద్విలాసముల్
దలచినుతింప నాతరమె దాశరథీ కరుణాపయోనిధీ.
పాతకులైన మీకృపకు బాత్రులు కారెతలంచిచూడ జ
ట్రాతికిగల్గె బావన మరాతికి రాజ్యసుఖంబుగల్గె దు
ర్జాతికి బుణ్యమబ్బెగపి జాతిమహత్త్వమునొందెగావునం
దాతవ యెట్టివారలకు దాశరథీ కరుణాపయోనిధీ.
మామక పాతక వజ్రము మ్రాన్పనగణ్యము చిత్రగుప్తులే
యేమని వ్రాతురో? శమనుడేమి విధించునొ? కాలకింకర
స్తోమ మొనర్చిటేమొ? వినజొప్పడ దింతకమున్నెదీనచిం
తామణి యొట్లు గాచెదవొ దాశరధీ కరుణాపయోనిధీ!
దాసిన చుట్టూమా శబరి? దాని దయామతి నేలినావు; నీ
దాసుని దాసుడా? గుహుడు తావకదాస్య మొసంగినావు నే
జేసిన పాపమో! వినుతి చేసినగావవు గావుమయ్య! నీ
దాసులలోన నేనొకఁడ దాశరధీ కరుణాపయోనిధీ!
దీక్షవహించి నాకొలది దీనుల నెందఱి గాచితో జగ
ద్రక్షక తొల్లియా ద్రుపద రాజతనూజ తలంచినంతనే
యక్షయమైన వల్వలిడి తక్కట నామొఱజిత్తగించి
ప్రత్యక్షము గావవేమిటికి దాశరథీ కరుణాపయోనిధీ.
నీలఘనాభమూర్తివగు నిన్ను గనుంగొనికోరి వేడినన్
జాలముసేసి డాగెదవు సంస్తుతి కెక్కిన రామనామ మే
మూలను దాచుకోగలవు ముక్తికి బ్రాపది పాపమూలకు
ద్దాలముగాదె మాయెడల దాశరథీ కరుణాపయోనిధీ.
వలదు పరాకు భక్తజనవత్సల నీ చరితంబు వమ్ముగా
వలదు పరాకు నీబిరుదు వజ్రమువంటిది గాన కూరకే
వలదు పరాకు నాదురిత వార్ధికి దెప్పవుగా మనంబులో
దలతుమెకా నిరంతరము దాశరథీ కరునాపయోనిధీ.
తప్పులెఱుంగ లేక దురితంబులు సేసితినంటి నీవుమా
యప్పవుగావు మంటి నికనన్యులకున్ నుదురంటనంటినీ
కొప్పిదమైన దాసజను లొప్పిన బంటుకు బటవంటి నా
తప్పుల కెల్ల నీవెగతి దాశరథీ కరుణాపయోనిధీ.
ఇతడు దురాత్ముడంచుజను లెన్నఁగ నాఱడిఁగొంటినేనెపో
పతితుఁడ నంటినో పతిత పావనమూర్తివి నీవుగల్ల నే
నితిరుల వేఁడనంటి నిహ మిచ్చిననిమ్ముపరంబొసంగుమీ
యతులిత రామనామ మధు రాక్షర పాళినిరంతరం బహృ
ద్గతమని నమ్మికొల్చెదను దాశరథీ కరుణాపయోనిధీ.
అంచితమైననీదు కరుణామృతసారము నాదుపైని బ్రో
క్షించిన జాలుదాననిర సించెదనాదురితంబు లెల్లదూ
లించెద వైరివర్గ మెడలించెద గోర్కులనీదుబంటనై
దంచెద, గాలకింకరుల దాశరథీ కరుణాపయోనిధీ. 60
జలనిధు లేడునొక్క మొగిఁ జక్కికిదెచ్చెశరంబు, ఱాతినిం
పలరఁగ జేసెనాతిగఁబ దాబ్జపరాగము, నీ చరిత్రముం
జలజభవాది నిర్జరులు సన్నుతి సేయఁగ లేరు గావునం
దలపనగణ్యమయ్య యిది దాశరథీ కరుణాపయోనిధీ.
కోతికిశక్యమా యసురకోటుల గెల్వను గాల్చెబో నిజం
బాతనిమేన శీతకరుడౌట దవానలు డెట్టివింత? మా
సీతపతివ్రతా మహిమసేవకు భాగ్యముమీకటాక్షము
ధాతకు శక్యమా పొగడ దాశరథీ కరుణాపయోనిధీ.
భూపలలామ రామరఘుపుంగవరామ త్రిలోక రాజ్య సం
స్ధాపనరామ మోక్షఫల దాయక రామ మదీయ పాపముల్
పాపగదయ్యరామ నిను బ్రస్తుతి చేసెదనయ్యరామ సీ
తాపతిరామ భద్రగిరి దాసరథీ కరుణాపయోనిధీ.
నీసహజంబు సాత్వికము నీవిడిపట్టు సుధాపయోధి, ప
ద్మాసనుడాత్మజుండు, గమలాలయనీ ప్రియురాలు నీకు సిం
హాసనమిద్ధరిత్రి; గొడుగాక సమక్షులు చంద్రబాస్కరుల్
నీసుమతల్పమాదిఫణి నీవె సమస్తము గొల్చినట్టి నీ
దాసుల భాగ్యమెట్టిదయ దాశరథీ కరుణాపయోనిధీ.
చరణము సోకినట్టి శిలజవ్వనిరూపగు టొక్కవింత, సు
స్ధిరముగ నీటిపై గిరులు దేలిన దొక్కటి వింతగాని మీ
స్మరణ దనర్చుమానవులు సద్గతి జెందిన దెంతవింత? యీ
ధరను ధరాత్మజారమణ దాశరథీ కరుణాపయోనిధీ.
దైవము తల్లిదండ్రితగు దాత గురుండు సఖుండు నిన్నె కా
భావన సేయుచున్నతఱి పాపములెల్ల మనోవికార దు
ర్భావితుజేయుచున్నవికృపామతివైనను కావుమీ జగ
త్పావనమూర్తి భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.
వాసవ రాజ్యభోగ సుఖ వార్ధిని దేలు ప్రభుత్వమబ్బినా
యాసకుమేర లేదు కనకాద్రిసమాన ధనంబుగూర్చినం
గాసును వెంటరాదు కని కానక చేసిన పుణ్యపాపముల్
వీసరబోవ నీవు పదివేలకు జాలు భవంబునొల్ల నీ
దాసునిగాగ నేలుకొను దాశరథీ కరుణాపయోనిధీ.
సూరిజనుల్ దయాపరులు సూనృతవాదు లలుబ్ధమానవుల్
వేరపతిప్రతాంగనలు విప్రులు గోవులు వేదముల్ మహా
భారముదాల్పగా జనులు పావనమైన పరోపకార స
త్కార మెఱుంగులే రకట దాశరధీ కరుణాపయోనిధీ!
వారిచరావతారము వారిధిలో జొఱబాఱి క్రోధ వి
స్తారగుడైన యా నిగమతస్కరవీర నిశాచరేంద్రునిం
జేరి వధించి వేదముల చిక్కెడలించి విరించికి మహో
దారతనిచ్చితీవెగద దాశరథీ కరుణాపయోనిధీ.
కరమనుర క్తిమందరము గవ్వముగా నహిరాజుద్రాడుగా
దొరకొన దేవదానవులు దుగ్ధపయోధిమథించుచున్నచో
ధరణిచలింపలోకములు తల్లడమందగ గూర్మమై ధరా
ధరము ధరించితీవెకద దాశరథీ కరుణాపయోనిధీ. 70
ధారుణి జాపజుట్టిన విధంబునగైకొని హేమనేత్రుడ
వ్వారిధిలోనదాగినను వానివధించి వరాహమూర్తివై
ధారుణిదొంటికై వడిని దక్షిణశృంగమున ధరించి వి
స్తార మొనర్చితీవే కద దాశరథీ కరుణాపయోనిధీ.
పెటపెటనుక్కు కంబమున భీకరదంత నఖాంతర ప్రభా
పటలము గప్ప నుప్పతిలి భండనవీధి నృసింహభీకర
స్ఫుటపటుశక్తి హేమకశిపు విదళించి సురారిపట్టి నం
తటగృపజూచితీవెకద దాశరథీ కరుణాపయోనిధీ.
పదయుగళంబు భూగగన భాగముల వెసనూని విక్రమా
స్పదమగునబ్బలీంద్రునొక పాదమునందల క్రిందనొత్తిమే
లొదవజగత్త్రయంబు బురు హూతునికియ్యవటుండవైనచి
త్సదమలమూర్తి వీవెకద దాశరథీ కరుణాపయోనిధీ.
ఇరువదియొక్కమాఱు ధరణీశుల నెల్లవధించి తత్కళే
బర రుధిర ప్రవాహమున బైతృకతర్పణ మొప్పజేసి భూ
సురవరకోటికి ముదము సొప్పడ భార్గవరామమూర్తివై
ధరణినొసంగితీ వెకద దాశరథీ కరుణాపయోనిధీ.
దురమున దాటకందునిమి ధూర్జటివిల్ దునుమాడిసీతనుం
బరిణయమంది తండ్రిపనుప ఘన కాననభూమి కేగి దు
స్తరపటుచండ కాండకులిశాహతి రావణకుంభకర్ణ భూ
ధరముల గూల్చితీ వెకద దాశరథీ కరుణాపయోనిధీ.
అనుపమయాదవాన్వయసు ధాబ్ధిసుధానిధి కృష్ణమూర్తినీ
కనుజుడుగాజనించి కుజనావళినెల్ల నడంచి రోహిణీ
తనయుడనంగ బాహుబల దర్పమున బలరామ మూర్తివై
తనరిన వేల్పవీవెకద దాశరథీ కరుణాపయోనిధీ.
సురలునుతింపగా ద్రిపుర సుందరుల వరియింపబుద్ధరూ
పరయగ దాల్చితీవు త్రిపురాసురకోటి దహించునప్పుడా
హరునకుదోడుగా వరశ రాసన బాణముఖో గ్రసాధనో
త్కర మొనరించితీవుకద దాశరథీ కరుణాపయోనిధీ.
సంకరదుర్గమై దురిత సంకులమైన జగంబుజూచి స
ర్వంకషలీల ను త్తమ తురంగమునెక్కి కరాసిబూని వీ
రాంకవిలాస మొప్ప గలి కాకృత సజ్జనకోటికి నిరా
తంక మొనర్చితీవుకద దాశరథీ కరుణాపయోనిధీ.
మనముననూహపోషణలు మర్వకమున్నె కఫాదిరోగముల్
దనువుననంటి మేనిబిగి దప్పకమున్నెనరుండు మోక్ష సా
ధన మొనరింపఁగావలయుఁ దత్త్వవిచారము మానియుండుట
ల్తనువునకు విరోధమిది దాశరథీ కరుణాపయోనిధీ.
ముదమున కాటపట్టుభవ మోహమద్వ దిరదాంకుశంబు సం
పదల కొటారు కోరికల పంట పరంబున కాది వైరుల
న్నదన జయించుత్రోవ విపదబ్ధికినావగదా సదాభవ
త్సదమలనామసంస్మరణ దాశరథీ కరుణాపయోనిధీ. 80
దురిత లతానుసార భయ దుఃఖ కదంబము రామనామభీ
కరతల హేతిచేఁ దెగి వకావకలై చనకుండ నేర్చునే
దరికొని మండుచుండు శిఖ దార్కొనిన శలబాదికీటకో
త్కరము విలీనమైచనవె దాశరథీ కరుణాపయోనిధీ.
హరిపదభక్తినింద్రియజ యాన్వితుడుత్తముఁడింద్రిమంబులన్
మరుగక నిల్పనూదినను మధ్యముఁడింద్రియపారశ్యుడై
పరగినచో నికృష్టుడని పల్కగ దుర్మతినైన నన్ను నా
దరమున నెట్లుకాచెదవొ దాశరథీ కరుణాపయోనిధీ.
వనకరిచిక్కు మైనసకు పాచవికిం జెడిపోయె మీనుతా
వినికికిఁజిక్కెఁజిల్వగను వేఁదుఱుఁ జెందెను లేళ్ళు తావిలో
మనికినశించె దేటితర మాయిరుమూఁటిని గెల్వనై దుసా
ధనములనీ వె కావనగు దాశరథీ కరుణాపయోనిధీ.
కరములుమీకుమ్రొక్కులిడ కన్నులు మిమ్మునె చూడ జిహ్వ మీ
స్మరణదనర్పవీనులుభ వత్కథలన్ వినుచుండనాస మీ
యఱుతును బెట్టుపూసరుల కాసగొనం బరమార్థ సాధనో
త్కరమిది చేయవేకృపను దాశరథీ కరుణాపయోనిధీ.
చిరతరభక్తి నొక్కతుళసీదళ మర్పణ చేయువాడు ఖే
చరగరు డోరగ ప్రముఖ సంఘములో వెలుగన్ సధా భవత్
సురుచిర ధీంద పాదముల బూజలొనర్చిన వారికెల్లద
త్పర మరచేతిధాత్రిగద దాశరధీ కరుణాపయోనిధీ!
భానుడు తూర్పునందుగను పుట్టినఁ బావక చంద్ర తేజముల్
హీనత జెందినట్లు జగదేక విరాజితమైన నీ పద
ధ్యానము చేయుచున్నఁ బర దైవమరీచులడంగకుండు నే
దానవ గర్వ నిర్దళన దాశరథీ కరుణాపయోనిధీ.
నీమహనీయతత్త్వ రస నిర్ణ యబోధ కథామృతాబ్ధిలో
దామునుగ్రుంకులాడకవృ థాతనుకష్టముజెంది మానవుం
డీ మహిలోకతీర్థముల నెల్ల మునింగిన దుర్వికార హృ
తామసపంకముల్ విదునె దాశరథీ కరుణాపయోనిధీ.
నీమహనీయతత్త్వ రస నిర్ణ యబోధ కథామృతాబ్ధిలో
దామునుగ్రుంకులాడకవృ థాతనుకష్టముజెంది మానవుం
డీ మహిలోకతీర్థముల నెల్ల మునింగిన దుర్వికార హృ
తామసపంకముల్ విదునె దాశరథీ కరుణాపయోనిధీ.
కాంచన వస్తుసంకలిత కల్మష మగ్ని పుటంబు బెట్టెవా
రించినరీతి నాత్మనిగిడించిన దుష్కర దుర్మలత్రయం
బంచిత భ క్తియోగ దహ నార్చిఁదగుల్పక పాయునే కన
త్కాంచనకుండలాభరణ దాశరథీ కరుణాపయోనిధీ.
నీసతి పెక్కు గల్ములిడనేర్పిరి, లోక మకల్మషంబుగా
నీసుత సేయు పావనము నిర్మిత కార్యధురీణ దక్షుడై
నీసుతుడిచ్చు నాయువులు నిన్న భుజించినఁ గల్గకుండునే
దాసులకీప్సి తార్థముల దాశరథీ కరుణాపయోనిధీ. 90
వారిజపత్రమందిడిన వారివిధంబున వర్తనీయమం
దారయ రొంపిలోన దను వంటని కుమ్మరపుర్వురీతి సం
సారమున మెలంగుచు విచారడైపరమొందుగాదెస
త్కార మెఱింగి మానవుడు దాశరథీ కరుణాపయోనిధీ.
ఎక్కడి తల్లిదండ్రి సుతులెక్కడి వారు కళత్ర బాంధవం
బెక్కడ జీవుఁడెట్టి తను వెత్తిన బుట్టును బోవుచున్న వా
డొక్కడెపాప పుణయ ఫల మొందిన నొక్కడె కానరాడువే
ఱొక్కడు వెంటనంటిభవ మొల్లనయాకృప జూడువయ్యనీ
టక్కరి మాయలందిడక దాశరథీ కరుణా పయోనిధీ.
దొరసినకాయముల్ముదిమి తోచినఁజూచిప్రభుత్వముల్సిరు
ల్మెఱపులుగాగజూచిమఱి మేదినిలోఁదమతోడివారుముం
దరుగుటజూచిచూచి తెగు నాయువెఱుంగక మోహపాశము
ల్దరుగనివారికేమిగతి దాశరథీ కరుణాపయోనిధీ.
సిరిగలనాఁడు మైమఱచి చిక్కిననాఁడుదలంచి పుణ్యముల్
పొరిఁబొరి సేయనైతినని పొక్కినఁ గల్గు నెగాలిచిచ్చుపైఁ
గెరలిన వేళఁదప్పికొని కీడ్పడు వేళ జలంబు గోరి త
త్తరమునఁ ద్రవ్వినం గలదె దాశరథీ కరుణాపయోనిధీ.
జీవనమింకఁ బంకమున జిక్కిన మీను చలింపకెంతయు
దావుననిల్చి జీవనమె దద్దయుఁ గోరువిధంబు చొప్పడం
దావలమైనఁగాని గుఱి తప్పనివాఁడు తరించువాఁడయా
తావకభక్తియో గమున దాశరథీ కరుణాపయోనిధీ.
సరసునిమానసంబు సర సజ్ఞుడెరుంగును ముష్కరాధముం
డెఱిఁగిగ్రహించువాడె కొల నేకనిసముఁ గాగదుర్దురం
బరయఁగ నేర్చునెట్లు విక చాబ్దమరంద రసైక సౌరభో
త్కరముమిళింద మొందుక్రియ దాశరథీ కరుణాపయోనిధీ.
నోఁచినతల్లిదండ్రికిఁ దనూభవుఁడొక్కడెచాలు మేటిచే
చాఁచనివాడు వేఱొకఁడు చాచిన లేదన కిచ్చువాఁడునో
రాఁచినిజంబకాని పలు కాడనివాఁడు రణంబులోన మేన్
దాచనివాఁడు భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.
శ్రీయుతజానకీరమణ చిన్నయరూప రమేశరామ నా
రాయణ పాహిపాహియని బ్రస్తుతిఁ జేసితి నామనంబునం
బాయక కిల్బిషవ్రజ వి పాటనమందఁగ జేసి సత్కళా
దాయి ఫలంబునాకియవె దాశరథీ కరుణాపయోనిధీ.
ఎంతటిపుణ్యమో శబరి యెంగిలిగొంటివి వింతగాదె నీ
మంతన మెట్టిదో యుడుత మైనిక రాగ్ర నఖాంకురంబులన్
సంతసమందఁ జేసితివి సత్కులజన్మము లేమి లెక్క వే
దాంతముగాదె నీ మహిమ దాశరథీ కరుణాపయోనిధీ.
బొంకనివాఁడెయోగ్యుడరి బృందము లెత్తిన చోటజివ్వకుం
జంకనివాఁడెజోదు రభసంబున నర్థి కరంబుసాఁచినం
గొంకనివాఁడెదాత మిముఁ గొల్చిభజించిన వాఁడె పోనిరా
తంక మనస్కుఁ డెన్న గను దాశరథీ కరుణాపయోనిధీ. 100
భ్రమరముగీటకంబుఁ గొని పాల్పడి ఝాంకరణో కారియై
భ్రమరముగానొనర్చునని పల్కుటఁ జేసి భవాది దుఃఖసం
తమసమెడల్చి భక్తిసహి తంబుగ జీవుని విశ్వరూప త
త్త్వమునధరించు టేమరుదు దాశరథీ కరుణాపయోనిధీ.
తరువులు పూచికాయలగు దక్కుసుమంబులు పూజగాభవ
చ్చరణము సోకిదాసులకు సారములో ధనధాన్యరాశులై
కరిభట ఘోటకాంబర నకాయములై విరజా సము
త్తరణ మొనర్చుజిత్రమిది దాశరధీ కరుణాపయోనిధీ!
పట్టితిభట్టరార్యగురు పాదములిమ్మెయినూర్ధ్వ పుండ్రముల్
వెట్టితిమంత్రరాజ మొడి బెట్టితి నయ్యమకింక రాలికిం
గట్టితిబొమ్మమీచరణ కంజలందుఁ దలంపుపెట్టి బో
దట్టితిఁ బాపపుంజముల దాశరథీ కరుణాపయోనిధీ.
అల్లన లింగమంత్రి సుతుడత్రిజ గోత్రజుడాదిశాఖ కం
చెర్ల కులోద్బవుం దంబ్రసిద్ధిడనై భవదంకితంబుగా
నెల్లకవుల్ నుతింప రచియించితి గోపకవీంద్రుడన్ జగ
ద్వల్లభ నీకు దాసుడను దాశరధీ కరుణాపయోనిధీ! 104
అడిగిన యట్టి యాచకుల యాశ లెఱుంగక లోభవర్తియై
కడపిన ధర్మ దేవత యొకానొకయప్పుడు నీదువాని కె
య్యెడల నదెట్లు పాలు తమికిచ్చునెయెచ్చటనైన లేగలన్
గుడువంగ నీనిచో గెరలి గోవులు తన్నునుగాక భాస్కరా.
అంగన నమ్మరాదు తనయంకకు రాని మహాబలాఢ్యు వే
భంగుల మాయలొడ్డి చెఱుపం దలపెట్టు, వివేకియైన సా
రంగ ధురుం బదంబులు గోయగ జేసె దొల్లిచి
త్రాగియనేకముల్ నుడువరాని కుయుక్తులుపన్ని భాస్కరా.
అదను దలంచికూర్చి ప్రజ నాదర మొప్ప విభుండు కోరినన్
గదిసి పదార్ధ ముత్తురటు కానక వేగమె కొట్టి తెండనన్
మొదటికి మోసమౌ బొదుగు మూలముగోసినబాలుగల్గునే
పిదికినగాక భూమి బశుబ్రుందము నెవ్వరికైన భాస్కరా.
ఆదరమింత లేక నరుడాత్మబలోన్నతి మంచివారికిన్
భేదము చేయటం దనదు పేర్మికి గీడగు మూలమెట్లమ
ర్యాద హిరణ్యపూర్వకశిపన్ దనుజుండు గుణాడ్యుడైన ప్ర
హ్లాదున కెగ్గుజేసి ప్రళయంబును బొందడెమున్ను భాస్కరా.
ఈజగమందు దామమనుజుడెంతమహాత్మకు డైనదైవమా
తేజముతప్ప జూచునెడె ద్రిమ్మరికోల్బన న్మహా
రాజకుమారుడైన రఘురాముడుగాల్నడగాయలాకులున్
భోజనమైతగన్వనికి బోయి, చరింపడె మున్ను భాస్కరా.
ఉరుగుణవంతుడొర్లుదనుకొడపకారము సేయునప్పుడున్
బరహితమేయొనర్చు నొకపట్టుననైనను గీడు సేయగా
నెఱుగడునిక్క మేకద యదెట్లనగవ్వముబట్టియెంతయున్
దరువగజొచ్చినం బెరుగు తాలిమినీయదె వెన్నభాస్కరా.
ఊరక సజ్జనుం డొదిగియుండిన నైన దురాత్మకుండు ని
ష్కారణ మోర్వలేక యపకారముచేయుట వాని విధ్యగా
చీరలు నూఱుటంకములు చేసెడివైనను బెట్టే నుండగా
జేరి చినింగి పోగొఱుకు చిమ్మట కేమి ఫలంబు భాస్కరా.
ఏగతి బాటుపడ్డ గలదే భువి నల్పునకున్ సమగ్రతా
భోగము భాగ్యరేఖగల పుణ్యునకుం బలె? భూపరిత్వనం
యోగమదేభకుంభ యుగశోత్ధిత మాంసము నక్కకూనకే
లాఘుటించు సింహము దలంచిన జేకురుగాక భాస్కరా.
ఒక్కడెచాలు నిశ్చలబలోన్నతుడెంతటికార్యమైనదా
జక్కనొనర్ప గౌరవు లసంఖ్యలు పుట్టినధేనుకోటులం
జిక్కగనీక తత్రప్బలసేన ననేక శిలీముఖంబులన్
మొక్కపడంగజేసి తుదముట్టడె యొక్క కిరీటి భాస్కరా.
కానగ చేర బోల దతిక్ర్ముడు నమ్మిన లెన్ని చేసినం
దానదినమ్మి వానికడ డాయగ బోయిన హానివచ్చున
చ్చోనదియెట్లనం గొరకుచూపుచు నొడినబోను మేలుగా
బోనని కాన కాసపడిపోవును గూలదెకొక్కు భాస్కరా. 10
కారణమైన కర్మములు కాక దిగంబడ వెన్ని గొందులం
దూఱిన నెంతవారలకు, దొల్లి పరీక్షిత్తు శాపభీతుడై
వారధినొప్పు నుప్పరిగపై బదిలంబుగ దాగియుండినం
గ్రూరబుజంగదంతహతిగూలడె లోకులె`రుంగ భాస్కరా.
ఒక్కడు మాంసమిచ్చె మఱియొక్కడు చర్మము గోసి యిచ్చె వే
ఱోక్కరు డస్ధి నిచ్చొనిక నొక్కడు ప్రాణములిచ్చె వీరిలో
నొక్క నిపట్టునన్ బ్రదుక నోపక యిచ్చిరో కీర్తి కిచ్చిరో
చక్కగ జూడు మంత్రి కుల సంభవ! రాయన మంత్రి భాస్కరా!
సన్నుత కార్యదక్షు డొకచాయ నిజప్రభ యప్రకాశమై
యున్నపుడైన లోకులకు నొండొక మేలొగ్నరంచు సత్వసం
పన్నుడు భీము డా ద్విజుల ప్రాణము కావడె ఏక చక్రమ
దెన్నికగా బకాసురుని నేపున రూపడగించి భాస్కరా!
అవని విభుండు నేరుపరియై చరియించిన గొల్పువార లె
ట్లవగుణులైన నేమి పనులన్నియు జేకుఱు వారిచేతనే
ప్రవిమల నీతిశాలియగు రాముని కార్యము మర్కటంబులే
దవిలి యొనర్పవే? జలధి దాటి సురారులద్రుంచి భాస్కరా!
వంచనయింతలేక యెటువంటి మహాత్ములనాశ్రయించినన్
గొంచమె కాని మేలు సమగూడ దదృష్టము లేనివారికిన్
సంచితబుద్ధి బ్రహ్మ ననిశంబును వీపున మోచునట్టిరా
యంచకుదమ్మితూండ్లు దిననాయెగధా ఫలమేమి భాస్కరా!
అతిగుణహీనలోభికి బ దార్థము గల్గిన, లేక యుండినన్
మితముగగాని కల్మిగల మీదటనైన భుజింపడింపుగ
సతమని నమ్ము దేహమును సంపద: నేఱులు నిండి పాఱినన్
గతుకగజూచు గుక్క తన కట్టడమీఱక యెందు భాస్కరా!
అనఘునికైనజేకుఱు ననర్హునిగూడి చరించినంతలో
మన మెరియంగ నప్పు డవ మానము, కీడు ధరిత్రియందు; నే
యనువుననైనదప్పవు; య దార్థము; తానది యెట్టు లన్నచో
నినుమునుగూర్చి యగ్నినల యింపదె సమ్మెట పెట్టు? భాస్కరా!
అరయ నెంత నేరుపరి యై చరియించిన వానిదాపునన్
గౌరవ మొప్పగూర్చునుప కారి మనుష్యుడు లేక మేలు చే
కూర; దదెట్లు? హత్తుగడ గూడునె? చూడబదాఱువన్నె బం
గారములోన నైన వెలి గారము కూడకయున్న? భాస్కరా!
ఈ క్షితి నర్థకాంక్ష మది నెప్పుడు పాయక లోకులెల్ల సం
రక్షకుడైన సత్ప్రభుని రాకలు గోరుదు రెందు జంద్రికా
పేక్ష జెలంగి చంద్రుడుద యించు విధంబునకై చకోరపుం
బక్షులుచూడవే యెదుర పారముదంబునుబూని భాస్కరా!
ఉరుకరుణాయుతుండు సమ యోచిత మాత్మదలంచి యుగ్రవా
క్పరుషత జూపినన్ ఫలము గల్గుట తధ్యముగాదె యంబుదం
బుఱిమినయంతనే కురియ కుండునె వర్షము లోకరక్షణ
స్థిరతరపౌరుషంబున శేషజనంబు లెఱుంగ భాస్కరా! 20
ఎట్టుగ బాటుపడ్డ నొక యించుక ప్రాప్తము లేక వస్తువుల్
పట్టుపడంగ నేరవు ని బద్ది సురావళిగూడి రాక్షసుల్
గట్టు పెకల్చి పాల్కడలి గవ్వముచేసి మధించి రంతయున్
వెట్టియెకగాక యేమనుభ వించిరి వా రమృతంబు భాస్కరా!
కట్టడ యైనయట్టి నిజ కర్మము చుట్టుచువచ్చి యేగతిం
బెట్టునొ? పెట్టినట్లనుభ వింపక తీఱదు: కాళ్ళు మీదుగా
గిట్టక వ్రేలుడంచు దల క్రిందుగ గట్టిరె యెవ్వరైన నా
చెట్టున గబ్బిలంబులకు జేసిన కర్మము గాక భాస్కరా!
కానిప్రయోజనంబు సమ కట్టదు తా భునినెంత విద్యవా
డైనను దొడ్డరాజుకొడు కైన నదెట్లు? మహేశుపట్టి వి
ద్యానిధి సర్వవిద్యలకు దానె గురుండు వినాయకుండు దా
నేను గురీతి నుండియు న దేమిటి కాడడు పెండ్లి? భాస్కరా!
క్రూరమనస్కులౌ పతుల గొల్చి వసించిన మంచివారికిన్
వారిగుణంబె పట్టి చెడు వర్తన వాటిలు మాధురీ జలో
దారలు గౌతమీముఖమ హానదు లంబుధి గూడినంతనే
క్షారముజెందవే? మొదలి కట్టడలన్నియు దప్పి భాస్కరా!
గిట్టుట కేడ గట్టడ లి ఖించిన నచ్చటగాని యొండుచో
బుట్టదు చావు జానువుల పున్కల నూడిచి కాశి జావ గా
ల్గట్టిన శూద్రకున్ భ్రమల గప్పుచు దద్విధి గుర్రమౌచు నా
పట్టునగొంచు మఱ్ఱికడ బ్రాణముదీ సెగదయ్య భాస్కరా!
ఘనబలసత్త్వ మచ్చుపడ గల్గినవానికి హాని లేనిచో
దనదగుసత్త్వమే చెఱుచు దన్ను నదెట్లన? నీరు మిక్కిలిన్
గనుక వసించినన్ జెఱువు కట్టకు సత్త్వము చాలకున్నచో
గనుమలు పెట్టి నట్టనడి గండి తెగంబడకున్నె? భాస్కరా!
చంద్రకళావతంసు కృప చాలనినాడు మహాత్ముడైన దా
సాంద్రవిభూతిబాసియొక జాతివిహీనునిగోల్చియుంట యో
గీంద్ర నుతాంఘ్రిపద్మ మతి హీనత నందుట కాదుగా; హరి
శ్చంద్రుడువీరబాహుని ని జంబుగగొల్వడెనాడు? భాస్కరా!
చదువది యెంత కల్గిన ర సజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకంబు గుణ సంయుతు లెవ్వరు మెచ్చ రెచ్చటం
బద నుగ మంచికూర నల పాకము చేసిన నైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచి పుట్టంగ నేర్చునటయ్య! భాస్కరా!
చేరి బలాధికుండెఱిగి చెప్పిన కార్యము చేయకుండినన్
బారము ముట్టలే డొక నె పంబున దా జెడు నెట్టి ధన్యుడున్
బోరక పాండుపుత్రులకు భూస్థలిభాగము పెట్టుమన్న కం
సారిని గాకుచేసి చెడ డాయెనె కౌరవభర్త? భాస్కరా!
చేసిన దుష్ట చేష్టనది చెప్పక నేర్పున గప్పిపుచ్చి తా
మూసినయంతటన్ బయలు ముట్టకయుండ దదెట్లు? రాగిపై
బూసిన బంగరుం జెదరి పోవ గడంగిన నాడునాటికిన్
దాసిన రాగి గానబడదా జనులెల్ల రెఱుంగ! భాస్కరా! 30
తగిలి మదంబుచే నెదిరి దన్ను వెఱుంగక దొడ్డవానితో
బగగొని పోరుటెల్ల నతి పామరుడై చెడు టింతెగాక తా
నెగడి జయింపనేర; డది నిక్కము తప్పదు ధాత్రిలోపలన్
దెగి యొక కొండతోదగరు ఢీ కొని తాకిన నేమి భాస్కరా!
తనకు ఫలంబులేదని యె దం దలపోయడు కీర్తిగోరు నా
ఘనగుణశాలి లోకహిత కార్యము మిక్కిలి భారమైన మే
లనుకొని పూను శేషుడు న హస్రముఖంబుల గాలిగ్రోలి తా
ననిశము మోవడే మఱి మ హాభరమైన ధరిత్రి? భాస్కరా!
దానపరోపకారగుణ ధన్యత చిత్తములోన నెప్పుడున్
లేని వివేకశూన్యనకు లేములు వచ్చిన వేళ సంపదల్
పూనినవేళ నొక్కసరి పోలును జీకున కర్థరాత్రియం
దైన నధేమి? పట్టపగ లైన నదేమియు లేదు భాస్కరా!
నొగిలినవేళ నెంతటి ఘ నుండును దన్నొక రొక్కనేర్పుతో
నగపడి ప్రోదిసేయక త నంతట బల్మికిరాడు నిక్కమే
జగమున నగ్నియైన గడు సన్నగిలంబడియున్న నింధనం
బెగయంగద్రోచియూదక మ ఱెట్లురవుల్కొననేర్చు? భాస్కరా!
పండితులైనవారు దిగు వందగ నుండగ నల్పుడొక్కడు
ద్దండత బీఠమెక్కిన బు ధ ప్రకరంబుల కేమి యెగ్గగున్?
గొండొక కోతి చెట్టుకొన కొమ్మల నుండగ గ్రింద గండభే
రుండ మదేభ సింహనికు రుంబము లుండవె చేరి? భాస్కరా!
పరహితమైన కార్యమతి భారముతోడిదియైన బూను స
త్పురుషుడు లోకముల్పొగడ బూర్వమునందొక ఱాలవర్షమున్
గురియంగ జొచ్చినన్ గదిసి గొబ్బున గో జనరక్షణార్థమై
గిరి నొక కేల నెత్తెన ట కృష్ణుడు చత్రముభాతి భాస్కరా!
పూనిన భాగ్యరేఖ చెడి పోయిన పిమ్మట నెట్టి మానవుం
డైనను వానినెవ్వరు బ్రి యంబున బల్కరు పిల్వరెచ్చటం
దానిది యెట్లొకో? యనినం దధ్యము; పుష్పము వాడి వాసనా
హీనతనొందియున్నయెడ నెవ్వరు ముట్టుదురయ్య! భాస్కరా!
ప్రేమనుగూర్చి యల్పునకు బెద్దతనంబును దొడ్డవానికిం
దా మతితుచ్చపుంబని నె దం బరికింపక యీయరాదుగా
వామకరంబుతోడగుడు వం గుడిచేత నపానమార్గముం
దోమగ వచ్చునే? మిగుల దోచని చేతలుగాక! భాస్కరా!
బలము తొలగుకాలమున బ్రాభవసంపద లెంతధన్యుండున్
నిలుపుకొనగ నోపడది నిశ్చయ; మర్జునుండీశ్వరాదులం
గెలిచినవాడు బోయలకు గీడ్పడి చూచు గృష్ణభార్యలం
బలుపుర నీయడే నిలువ బట్ట సమర్థుడు గాక భాస్కరా!
భూనుతులైన దేవతలు పూర్వము కొందఱు వావివర్తనల్
మాని చరింపరో యనుచు మానవులట్ల చరింపబోల
దంభోనిధులన్నియుందనదు పుక్కిటంబట్టె నగస్త్యుండంచు నా
పూనిక కెవ్వండోపు? నది పూర్వమహత్త్వముసుమ్ము భాస్కరా! 40
భ్రష్టున కర్థవంతులగు బాంధవు లెందఱు గల్గినన్ నిజా
దృష్టములేదు గావున ద రిత్రబాపగ లేరు సత్కృపా
దృష్టిని నిల్పి లోకుల క తిస్థిరసంపద లిచ్చు లక్ష్మి యా
జెష్ట కదేటికిం గలుగ జేయదు తోడనెపుట్టి భాస్కరా!
మానవుడాత్మకిష్ట మగు మంచి ప్రయోజన మాచరించుచో
గానక యల్పుడొక్కడది గాదని పల్కిన వానిపల్కుకై
మానగజూడ డాపని స మంచితభోజనవేళ నీగ కా
లూనిన వంటకంబు దిన కుండగ నేర్పగునోటు భాస్కరా!
ఊరక వచ్చుcబాటుపడ కుండిననైన ఫలం బదృష్ట మే
పారcగcగల్గువానికిcబ్ర యాసము నొందిన దేవదానవుల్
వార లటుండcగా నడుమ వచ్చినశౌరికిcగల్గెcగాదె శృం
గారపుcబ్రోవు లక్ష్మియును గౌస్తుభరత్నము, రెండు బాస్కరా!
ఉరుబలశాలి నంచుcదను నొల్లని యన్య పతివ్రతాంగనా
సురతము గొరెనని కడ సుమ్మది భూతికిc బ్రాణహానియౌ
శివ్రములు గూల రాఘవును చే దశకంఠుcడు ద్రుంగిపోవcడె
యెఱుcగక సీతకాసపడి యిష్టులభృత్యులcగూడి భాస్కరా!
ఎడపక దుర్జనుం డొరుల కెంతయుcగీడొనరించుcగాని, యే
యోడలను మేలు సేయcడొక, యించుక యైనను: జీడపుర్వు దాc
జెడcధిను: నింతెకాక పుడి, సెండు జలల బిడి పెంప నేర్చునే
పొడవగుచున్న పుష్పఫల, భూరుహ మొక్కటినైన? భాస్కరా!
ఎడ్డెమనుష్యుcడేమెఱుcగు, నెన్నిదినంబులు గూడియుండినన్
దొడ్డగుణాధ్యునందుcగల, తోరపువర్తనలెల్లc బ్రజ్ఞcబే
ర్పడ్డావివేకరీతి: రుచి, పాకము నాలుకగా కెఱుంగునే
తెడ్డది కూరలోc గలయుc గ్రిమ్మరుచుండిన నైన భాస్కరా!
ఎప్పుడదృష్టతామహిమ, యించుక పాటిలు, నప్పుడింపు సొ
పొప్పుచు నుండుcగాక: యది, యొప్పని పిమ్మట రూపుమాయుcగా
నిప్పున నంటియున్న యతి, నిర్మలినాగ్ని గురుప్రకాశముల్
దప్పిన, నట్టిబొగ్గునకుc దా నలు పెంతయుc బుట్టు భాస్కరా!
ఏడ ననర్హుc డుండు నట, కేగు ననర్హుcడు, ననర్హుcడున్నచోc
జూడcగ నొల్లc; డెట్లన, న, శుద్దగుణస్థితి నీcగ పూయముc
గూడినపుంటిపై నిలువc, గోరినయట్టులు నిల్వనేర్చునే
సూడిదcబెట్టు నెన్నుదౌటి చొక్కపుc గస్తురిమీద? భాస్కరా!
ఏల సమస్తవిద్యల? నొ , కించుక భగ్యము గల్గియుండినన్
జాలు: ననేక మార్గముల , సన్నుతి కెక్కు; నదెట్లొకో యునన్
ఱాలకు నేడ విద్యలు? తి, రంబుక్గ దేవర రూపు చేసినన్
వ్రాలి నమస్కరించి ప్రస, వంబులు పెట్టరె మీcద భాస్కరా!
కట్టడcదప్పి తాము చెడు, కార్యముc జేయుచు నుండిరేని దోc
బుట్టినవారినైన విడి, పోవుట కార్యము; దౌర్మదాంధ్యముం
దొట్టిన రావణాసురుని, తో నెడcబాసి విభీషణాఖ్యుc డా
పట్టున రాముc జేరి చిర, పట్టము గట్టుకొనండె! భాస్కరా! 50
కట్టడ లేని కాలమున; గాదు శుభం బొరు లెంతవారు చే
పట్టిన నైన, మర్త్యునకు, భాగ్యము రాదను టెల్ల్యుcగల్ల కా;
దెట్టని పల్కినన్ దశర, ధేశ వసిష్టులు టెల్ల్యుc గల్ల కా;
బట్టము కట్ట్యుc గోరి ; రది, పాయక చేకుఱెనోటు; భాస్కరా!
కులమున నక్కడక్కడన, కుంఠితధార్మకుc డొక్కcడొక్కcడే
కలిగెడుcగాక, పెంద!రుచుc, గల్గcగనేరరు; చెట్టుచెట్టునన్
గలుగcగ నేర్చునే గొడుగు, కామలు చూడcగ నాడనాడ నిం
పలరcగనొక్కటొక్కటిన, యంబునcజేకుఱుcగాక! భాస్కరా!
ఘనుcడగునట్టివాcడు నిజ్, కార్యసముద్దరణార్థమై మహిం
బనివడి యల్పమానవునుc, బ్రార్థనcజేయుట తప్పుగాదు గా;
యనఘరc గృష్ణజన్మమున, నా వసుదేవుcడు మీcదు టెత్తుగాc
గనుcగొని గాలిగాని కడ, కాళ్ళకు మ్రొక్కcడె నాcడు భాస్కరా!
ఘనుcడొకవేళc గీడ్పడినc , గ్రమ్మఱ నాతని లేమి వాపcగాc
గనుగొన నొక్క సత్పృభువు, గాక నరాధము లోపరెందఱుం;
బెనుcజెఱు వెండినట్టితఱిc, బెల్లున మేఘుcడు గాక, నీటితోc
దనుపc దుధారముల్ శతశ, తంబులు చాలునcటయ్య భాస్కరా!
చక్కcదలంపగా విధివ, శంబున నల్పునిచేతనైనcదాc
జిక్కి యవస్థలం బొరలు, జెప్పcగరాని మహాబలాధ్యుcడున్;
మిక్కిలి సత్వసంపదల మీఱిన గంధగజంబు మావటీ(c
డెక్కియదల్చికొట్టి కుది, యించిన నుండదెయోర్చి? భాస్కరా!
చాలcవిత్రవంశమున, సంజనితుం డగునేని యెట్టి దు
శ్శీలునినైనcదత్కుల వి, శేషముచే నొక పుణ్యుcడెంతయుం
దాలిమి నుద్ధరించును; సు, ధానిధిc బుట్టcగcగాదె శంభుcదా
హలహలనలంబు గళ, మందు ధరించుట పూని భాస్కరా!
తడవcగరాదు దుష్టగుణూc, దత్వమెఱుంగక; యెవ్వరైన నా
చెడుగుణ మిట్లు వల్వదని, చెప్పినcగ్రక్కునcగోపచిత్తుcడై
కడుదెగcజూచుcగా, మఱుcగc, గాగినతైలము నీటిబొట్టుపై(
బడునెడ నాక్షణం బెగసి, బగ్గున మండక యున్నె భాస్కరా!
తనకు సదృష్టరేక్ష విశ, దంబుగc గల్గినcగాని, లేనిచో
జనునకు నెయ్యెడన్ బరుల, సంపద వల్ల ఫలంబు లేదుగా;
కనుగవ లెస్సcదాదెలివి, గల్గినవారికిcగాక, గ్రుడ్డికిన్
కనcబడు నెట్లు వెన్నెలలు, గాయcగ నందొక రూపు భాస్కరా!
తాలిమి తోడుతం దగవుc, దప్పక నేర్పరియెప్పుదప్పులం
బాలన సేయుcగా; కటను, పాయవిహీఉదించయ నేర్చున?
పాలను నీరు వేఱుపఱు, వంగ మరాళ మిఱుంగులోమెఱుంగుc గాని, మా
ర్జాల మెఱుంగునే తదురు, చారురసజ్ఞతc బూన? భాస్కరా!
తాలిమితోడc గూరిమిc గృ, తఘ్నున కెయ్యెడ నుత్తమోత్త
ముల్ మే లొనరించిన్ గుణము మిక్కిలి కీడగుc; బాముపిల్ల
కున్ పాలిడిపెంచినన్ విషము, పాయcగనేర్చునె! దానికో ఱలం
జాలcగ నంతకంత కొక, చాయను హెచ్చును గాక భాస్కరా! 60
తెలియని కార్య మెల్లcగడ, తేర్చుట కొక్కవివేకిc జేకొనన్
వలయు, నటైన దిద్దుకొనక, వచ్చ్c; బ్రయోజన మాంధ్య మేమి
యుంగలుగదు; ఫాలమందుc దుల, కంభిడునప్పుడు చేత నద్ద
మున్ గలిగినc జక్కcజేసికొనుc, గాదె నరుండదిచూచి భాస్కరా!
దక్షుcడు లేనియింటికిcబ, దార్థము వేఱొకచోట నుండి వే
లక్షలు వచ్చుచుండినcబ, లాయనమై చనుc, గల్లగాదు; ప్ర
త్యక్షము; వాcగులున్ వఱద, లన్నియు వచ్చిన నీరు నిల్చునే,
యక్షయమైన గండి తెగి, నట్టి తటాకములోన భాస్కరా!
దానము సేయcగోరిన వ, దాన్యున కీయcగ శక్తిలేనిచో
నైనcబరోపకారమున, కైయొక దిక్కునcదెచ్చియైన నీc
బూనును; మేఘcడంభుధికిc, బోయిజలంబునcదెచ్చియీయcడె
వాన సమస్తజీవులకుc, వాంచిత మింపెసలార భాస్కరా!
దానముచేయనేరని య, ధార్మికు సంపద యుండియుండియున్
దానె పలాయనం బగుట, తధ్యము; బూరుగుమ్రాను గాచినన్
దానిఫలంబు లూరక వృ, ధా పడిపోవవె యెండి గాలిచేc
గానలలోన, నేమిటికిc, గాక యభోజ్యము లౌట భాస్కరా!
నడవక చిక్కి లేమి యగు, నాcడు నిజోదరపోషణార్థమై
యడిగిభుజించుటల్ నరుల, కారయవ్యంగ్యముకాదు; పాండవుల్
గడుబలశాలు లేవురు న, ఖండవిభూతిc దొలంగి, భైక్షముల్
గుడువరెయేకచక్రపురిc, గుంతియుcదారొకచొట? భాస్కరా!
నుడూపుల నేర్పుచాలని మ, నుష్యుcడెఱుంగక తప్పనాడినం
గడుc గృపతోc జెలంగుదురు, కాని, యదల్పరు తజ్ఞులెల్లంc; ద
ప్పడుగులు పెట్టుచు న్నడుచు, నప్పుడు బాలుని ముద్దుసేయcగాc
దొడcగుదు, రింతెకాని పడc, ద్రోయుదురే యెవరైన? భాస్కరా!
నేరిచి బుద్దిమంతుcడతి, నీతివివేకము దెల్పినం, జెడం
గారణ మున్నవాని కది, గైకొనcగూడదు; నిక్కమే; దురా
చారుcడు రావణాసురుcడ, సహ్యము నొందండె? చేటు కాలముం
జేరువ యైననాcడు నిర, సించి విభీషణు బుద్ది? భాస్కరా!
పట్టుగ నిక్కుచున్ మదముc, బట్టి మహాత్ములc దూలనాడినం
బట్టినకార్యముల్ చెడును; బ్రాణము పోవు; నిరర్థదోషముల్
పుట్టు; మహేశుcగాదని కు, బుద్ది నొనర్చిన యజ్ఞతంత్రముల్
ముట్టకపోయి, దక్షకునికి, మోసము వచ్చెగదయ్య!భాస్కరా!
పలుచని హీనమానవుcడు, పాటిదలంపక నిష్టురోక్తులం
బలుకుచు నుండుcగాని, మతి, భాసురుcడైన గుణప్రపూర్ణుcడ
ప్పలుకులcబల్కబోవcడు; ని, బద్దిగ; నెట్లన, వెల్తికుండ దాc
దొలcకుచునుండుcగాని, మఱితొల్కునె నిండుఘటంబు భాస్కరా!
పాపపుcద్రోవవాని కొక, పట్టున మేని వికాస మెందినన్
లోపల దుర్గుణాంబె ప్రబ, లుంగద? నమ్మcగcగూడ దాతనిన్;
బాపటకాయకున్ నునుపు, పైపయి గల్గినcగల్గుగాక! యే
రూపున దానిలోcగల వి, రుద్దపుcజేcదు నశించు భాస్కరా! 70
పూరితసద్గుణంబు గల, పుణ్యున కించుక రూప సంపదల్
దూరములైన, వానియెడ, దొడ్డగcజూతురు బుద్దిమంతు; లె
ట్లారయ గొగ్గులైన మఱి, యందుల చూచికాదె, ఖ
ర్జూరఫలంబులం బ్రియము, చొప్పడ లోకులు గొంట? భాస్కరా!
ప్రల్లcదనంబుచే నెఱుక, పాటొకయింతయు లేక యెచ్చటన్
బల్లిదుcడైన సత్ప్రభున, బద్దము లాడినcద్రుంగిపోదు; రె
ట్లల్ల సభాస్థలిం గుమతు, లై శిశుపాలుcడు దంతవత్త్రుcడుం
గల్లలు గృష్ణూనిం బలికి, కాదె హతం బగు టెల్ల? భాస్కరా!
బంధుర సద్గుణాఢ్యుcడొక, పట్టున లంపట నొందియైన, దు
స్సంధి దలంపc; డన్యులకుc, జాలహితంబొనరించుcగాక; శ్రీ
గంధపుజెక్క రాగిలుచుc గాదె, శరీరుల కుత్సవార్థమై
గంధములాత్మcబుట్టcదఱు, గంబడి యుండుటలెల్ల భాస్కరా!
బలవంతుcడైనవేళ నిజ, బంధుcడు తోడ్పడుగాని, యాతcడే
బలము తొలగెనేని తన, పాలిట శత్రు వదెట్లు? పూర్ణుcడై
జ్వలనుcడు కానcగాల్చుతఱి, సఖ్యముcజూపును వాయుదేవుc; డా
బలియుcడు సూక్షమదీపమగు, పట్టుననార్పcడె గాలి భాస్కరా!
బల్లిదుcడైన సత్ర్పభువుం, వాయక యుండినగాని రచ్చలోc
జిల్లరవారు నూఱుగురు, సేరినcదేజము గల్గదెయ్యెడన్;
జల్లని చందురుండెడసి, సన్నపుcజుక్కలు కోటి యున్న రం
జిల్లునె వెన్నెలల్? జగము, చీcకటులన్నియుcబాయ భాస్కరా!
భుజబలశౌర్యవంతులగు, పుత్త్రులcగాంచినవారి కెయ్యెడన్
నిజహృదయేపిప్సితార్థములు, నిక్కము చేకుఱుc; గుంతి దేవికిన్
విజయబలాఢ్యుcడర్జునుcడు, వీర పరాక్రమ మొప్ప దేవతా
గజమునుదెచ్చి, తల్లివ్రత, కార్యముదీర్పcడెతొల్లి భాస్కరా!
భూరిబస్లాఢ్యుcడైనcదల, పోయక విక్రమశక్తిచే నహం
కారము నొందుటల్ తగవు, గా; దతcడొక్కెడ మోసపోవుcగా;
వీరవరేణ్యుcడర్జునుcడు, వింటికి నే నధికుండ నంచుc, దా
నూరక వింటి నెక్కిడcగ, నోపcడు కృష్ణుడు లేమి భాస్కరా!
మదిcదను నాశపడ్డయెడ, మంచిగుణోన్నతుcడెట్టిహీనునిన్
వదలcడు, మేలుపట్టున న, వశ్యము మున్నుగ నాదరించుcగా;
త్రిదశ విమాన మధ్యమునc, దెచ్చి కృపామతి సారమేయమున్
మొదలనిడండె ధర్మజుcడు, మూcగిసురావళిచూడ?భాస్కరా!
మాటల కోర్వcజాలcడభి మానసమగ్రుcడు; ప్రాణహానియౌ
చోటులనైనcదా నెదురు, చూచుచునుండుcగోలంకులోపల
న్నిట మునింగినపు డతి, నీచము లాడిన రాజరాజు పో
రాట మొనర్చి నేలcబడc, డాయెనె భీమునిచేత? భాస్కరా!
మానవనాధుcడాత్మరిపు, మర్మమెఱింగినవాని నేలినc
గాని, జయింప లేcడరులc, గార్ముకదక్షుcడు రామభద్రుcడా
దానవనాయకున్ గెలువc, దా నెటులోపు, దదీయనాభికా
స్థానసుధన్ విభీషణుcడు, తార్కొని చెప్పక యున్న భాస్కరా! 80
మునుపొనరించుపాతక మ, మోఘము; జీవులకెల్లcబూని యా
వెనుకటి జమమం దనుభ, వింపక తీఱవు; రాఘవుండు వా
లినిcబడనేసి తా మగువ, లీల యదూద్భవుcడై, కిరాతుచే
వినిశిత బాణపాతమున, వీడ్కొనcడే తనమేని? భాస్కరా!
రాకొమరుల్ రసజ్ఞునిcది, రంబుగ మన్నన నుంచినట్లు, భూ
లోకమౌనందు మూఢుcదమ, లోపలనుంపరు; నిక్కమేకదా?
చేకొని ముద్దుగాcజదువు, చిల్కను బెంతురుగాక; పెంతురే
కాకము నెవ్వరైన? శుభ, కారణ! సన్మునిసేవ్య భాస్కరా!
లోకములోన దుర్జనుల, లోcతు నెఱుంగక చేరరాదు సు
శ్లోకుcడు; చేరినం గవయc, జూతురు; చేయుదు రెక్కసక్కెముల్;
కోకిలcగన్నచోట గుమి, గూడి యసహ్యపుc గూcతలార్చుచున్
గాకులు తన్నవే తఱిమి, కాయము తల్లడమంద భాస్కరా!
లోను దృఢంబుగాని పెను, లోభిని నమ్మి, యసాధ్యకార్యముల్
కానక పూనునే నతcడు, గ్రక్కునcగూలును; నోటిపుట్టిపై
మానవుcడెక్కిపోవ నొక, మాటు పుటుక్కున ముంపకుండునే,
తా నొక లోcతునం గెడసి, దానిc దరింపcగలేక? భాస్కరా!
వట్టుచుcదండ్రి ఊత్యధమ, వర్తనుcడైననుగాని, వానికిం
బుట్టిన పుత్రకుండు తన, పుణ్యవంశంబున దొడ్డ ధన్యుcడౌ,
నెట్టన? మ~త్తివిత్తు మును, పెంతయుcగొంచెము, దానcబుట్టు నా
చెట్టు మహొన్నతత్వమును, జెందదె శాఖల నిండి? భాస్కరా!
వలనుగcగానలందుcబ్రతి, వర్షమునం బులి నాలుగైదు పె
ల్లల్cగను: దూడనొక్కటి ని, లంగను ధేనువు రెండుమూcడు నేc
డుల; కటులైన బెబ్బులి కు, టుంబము లల్పములాయె; నాలమం
దలు గడువృద్ధిcజెందవె య, ధర్మము ధర్మముcదెల్ప భాస్కరా!
వలవదు క్రూరసంగతి య, వశ్య మొకప్పుడు సేయcబడ్డచోc
గొలcదియె కాక యెక్కువలుం గూడవు; తమ్ములపాకు లోపలం
గలసిన సున్నముంచుకయుc, గాక మఱించుక ఎక్కువైనచో,
నలుగడcజుఱ్రుచుఱ్రుమన, నాలుకపొక్కకయున్నె? భాస్కరా!
వానికి విద్యచేత సిరి, వచ్చె నటంచును, విద్య నేర్వcగాc
బూనిన్c బూనుcగాక! తన, పుణ్యము చాలక భాగ్యరేక్షకుం
బూనcగ నెవ్వcడోపు; సరి, పో చెవి పెంచునుగా; కదృష్టతా
హీనుcడు కర్ణభూషణము, లెట్లు గడింపcగ నోపు భాస్కరా!
సంతత పుణ్యశాలి నొక, జాడను సంపద వసిపోయి, తా
నంతటcబోక నెట్టుకొని, యప్పటియట్ల వసించియుండు; మా
సంతమునందుcజందురుని, నన్నికళల్; పెడcబాసి పోయినం
గాంతి వహింపcడోటు తిరు, గంబడి దేహమునింత భాస్కరా!
సకల జనప్రియత్వము ని, జంబుగcగల్గిన పుణ్యశాలి కొ
క్కొకయెడ నాపదైనcదడ, వుండదు; వేగమె పాసిపోవుcగా;
యకలుషమూర్తియైయమృ, తాంశుcడు రాహువుతున్న మ్రింగినన్
ఉకటక మానియుండcడె దృ, ఢస్థితి నెప్పటియట్ల భాస్కరా! 90
సరసగుణ ప్రపూణునకు, సన్నపు దుర్గుణ మొక్కవేళయం
దొరసిన, నిట్లు నీకుcదగు, నో? యని చెప్పిన మాననేర్చుcగా;
బురద యొకించుకంత తముc, బొందినవేళలc జిల్లవిత్తు పై
నొరసిన నిర్మలత్వమున, నుండవె నీరము లెల్ల? భాస్కరా!
సరసదయా గుణంబుగల, జాణ మహింగడు నొచ్చి యుండియుం
దఱచుగ వాని కాసపడి, డాయcగవత్తురు లోకు:లెట్లనం
జెఱకురదంబు గానుcగను, జిప్పిలి పోయినమీcదc బిప్పియై
ధరcబడియున్నcజేరవె ము, దంబునcజీమలు పెక్కు భాస్కరా!
సారవివేకవర్తనల సన్నుతి కెక్కినవారిలోపలన్
జేరినయంత మూఢులకుc, జేపడ దానడ; యెట్టులన్నc;గా
సారములోన హంసముల, సంగతినుండెడి కొంగపిట్ట కే
తీరునcగల్గనేర్చును ద, దీయగతుల్ దలపోయ? భాస్కరా!
సిరిగలవాని కెయ్యెడలc, జేసిన మే లది నిష్ఫలం బగున్;
నెఱి గుఱి గాదు; పేదలకు, నేర్పునcజేసిన సత్ఫలం బగున్;
వఱపున వచ్చి మేఘcడొక, వర్షము వాడిన చేలమీcదటం
గురిసినcగాక, యంబుధులcగుర్వcగ నేమి ఫలంబు? భాస్కరా!
సిరివలెనేని సింహగుహ, చెంత వసించినcజాలు; సింహముల్
కరుల్ వధింపగా నచటc, గల్గును దంతచయంబు ముత్యముల్;
హరూగా నక్కబొక్కకడ, నాశ్రయ మందిన నేమి గల్గెడుం
గొరిసెలుదూడతోcకలునుం గొమ్ములు నెమ్ములుcగాక! భాస్కరా!
స్థిరతర ధర్మవర్తనcబ్ర, సిద్దికి నెక్కిన వాని నొక్కము
ష్కరుcడతి నీచవాక్యములc, గాదని పల్కిన, నమ్మహాత్ముcడుం
గొఱcత వహింపcడయ్యెడ; న, కుంఠితపూర్ణ సుధాపయోధిలో
నరుగుచుcగాకి రెట్ట యిడి, నందున నేమి కొఱంత? భాస్కరా!
స్ఫురత కీర్తిమంతులగు, పుత్రులcగాంచినcగాక, మూఢ ము
షర్కులc గనంగcదేజములు, గల్గవుగా? మణీకీలి తాంగుళా
భరణము లంగుళంబుల శు, భస్థితిcబెట్టినcగాక; గాజుటుం
గరములు పెట్టినందున వి, కానము కల్గుటయ్య! భాస్కరా!
సేనగ వాంఛితాన్నము భు, జింపcగలప్పుడు గాక, లేనిచో
మేనులు డస్సియుంట నిజ, మేకద దేహుల; కగ్ని హొత్రుండౌ
నే నిజభోజ్యముల్ గుడుచు, నేనియుcబుష్టివహించు; లేనినాc
డూని విభూతిలో సణcగి, యుండcడె తేజము తప్పి? భాస్కరా!
హాళి నిజప్రబుద్ది తిర, మైన విధంబునc బెట్టుబుద్దు లా
వేళల కంతెకాని మఱి, వెంకకు నిల్వవు; హేమకాంతి యె
న్నాళుల కుండుcగాని,యొక, నాcడు పదంపడి దానcబట్టినన్
దాళుకయుండునో యినుప, తాటకుcజాయలుపోక భాస్కరా!
హీనకులంబునందు జని, యించినవారికి సద్గుణంబు లె
న్నేనియుcగల్గియున్న, నొక, నేరము చెందకపోదు; పద్మములు
భూనుతుcగాంచియున్ బురదc, బుట్టుటవల్ల సుధాకరోదయం
బైన ననహ్యమొందవె ప్రి, యంబునcజూడcగలేక భాస్కరా! 100
కరణము సాదై యున్నను
గరి మద ముడిఁగినను బాము గఱవకయున్నన్
ధరఁ దేలు మీటకున్నను
గరమరుదుగ లెక్కఁగొనరు గదరా సుమతీ!
భావం: కరణము మెత్తనితనము గలిగియుండినను, ఏనుగు మదము విడిచినను, పాముకరవకున్నను, తేలుకుట్టకుండిననుజనులు లక్ష్యముచేయరు.
ఇచ్చునదె విద్య, రణమునఁ
జొచ్చునదే మగతనంబు, సుకవీశ్వరులు
మెచ్చునదె నేర్పు, వాదుకు
వచ్చునదే కీడుసుమ్ము! వసుధను సుమతీ!
భావం: ధనము నిచ్చునదే విద్య, యుద్ధభూమిలో చొరబదునదే పౌరషము. గొప్ప కవులు గూడ మెచ్చు నట్టిదే నేర్పరి తనము, తగువునకు వచ్చుటయే చెరవు.
కడు బలవంతుండైనను
బుడమినిఁబ్రాయంపుటాలిఁ పుట్టిన యింటన్
దడ వుండనిచ్చె నేనియుఁ
బడుపుగ నంగడికిఁదానె బంపుట సుమతీ!
భావం: ఎంత బలవంతుడైనను, పడుచు పెండ్లామును ఆమె పుట్టింటి దగ్గర యెక్కువ కాల ముండనిచ్చిన యెదల, తానే యామెను వ్యభిచారిణీగా దుకాణమునకు పంపినట్లగును.
కసుగాయఁగఱచి చూచిన
మసలక తన యొగరు గాక మధురంబగునా?
పస గలుగు యువతు లుండఁగఁ
బసిబాలలఁబొందువాఁడు పశువుర సుమతీ!
భావం: పండిన పండు తినక, పచ్చికాయకొరికినచో వెంటనే వగరు రుచి తోచునుగాని, మధురమెట్లు గలుగునో; అట్లే యౌవనము గల స్త్రీ లుండగా పసి బలికలతో కూడినచో వికటముగా నుండును. చిన్న బాలికల పొందు గూడిన వాడు పశువుతో సమానుడు.
ధనపతి సఖుఁడై యుండియు
నెనయంగా శివుఁడు భిక్షమెత్తఁగవలసెన్
దనవారి కెంత గలిగిన
తన భాగ్యమె తనఁకుగాక తధ్యము సుమతీ!
భావం: ధన వంతుడైన కుబేరుడు స్నేహితుడై నప్పటికినీ ఈశ్వరుడు బిచ్చమెత్తుట సంభవించెను. కాబట్టి, తన వారికెంత సంపద యున్నను, తనకుపయోగపడదు. తన భాగ్యమే తనకు ఉపయోగించును.
తనవారు లేని చోటను
జన వించుక లేనిచోట జగడము చోటన్,
అనుమానమైన చోటను,
మనుజును ట నిలువఁదగదు మహిలో సుమతీ!
భావం: తన బంధువులు లేని తావునను, తనకు మచ్చికలేని తావునను, తనపై ననుమాన మయిన తావునను మనుష్యుడు నిలువ కూడదు.
తములము వేయని నోరును
వినుతులతో జెలిమి సేసి వెతఁబడు తెలివిన్
గమలములు లేని కొలకుఁను
హిమధాముఁడు లేని రాత్రి హీనము సుమతీ!
భావం: తాంబూలము వేసుకొనని నోరును, విరుద్ధమైన మతము గల వారితో స్నేహముచేసి విచారించు వివేకమును, తామరలు లేని సరస్సును, చంద్రుడు లేని రాత్రియును నీచ మయినవి.
తలపొడుగు ధనముఁబోసిన
వెలయాలికి నిజములేదు వివరింపంగాఁ
దల దడివి బాస జేఁసిన
వెలయాలిని నమ్మరాదు వినరా సుమతీ!
భావం: తల పొడుగు, ధనము పోసినప్పటికినీ వేశా స్త్రీకి సత్యమాడుట లేదు. తల మిద చేయి వేసుకొని ప్రమాణము చేసినను వార కాంతను నమ్మరాదు.
తలమాసిన వొలుమాసిన
వలువలు మాసినను బ్రాణ వల్లభునైనన్
కులకాంతలైన రోఁతురు
తిలకింపఁగ భూమిలోన దిరముగ సుమతీ! 10
భావం: ఆలోచింపగా, భూమియందు, తలయు, శరీరము, బట్టలుమాసినచో పెనిమిటినైననూ (నుంచి స్త్రీలైనప్పటికిన్నీ) అసహ్యపడుట నిజము.
దగ్గర కొండెము సెప్పెడు
ప్రెగ్గడపలుకులకు రాజు ప్రియుఁడై మఱి తా
నెగ్గుఁ బ్రజ్జ కాచరించుట
బొగ్గులకై కల్పతరువుఁబొడచుట సుమతీ!
భావం: దగ్గర నున్న మంత్రి చెప్పు చాడీలను విని; రాజు యిష్టపడి; ప్రజలకు కీడు చేయుట అనునది; కోరిన కొరికల నిచ్చు చెట్టును బొగ్గులకై నరకుటతో సమానముగా నుండును.
కాదుసుమీ దుస్సంగతి
పోదుసుమీ కీర్తికాంత పొందిన పిదపన్,
వాదుసుమీ యప్పిచ్చుట
లేదుసుమీ సతులవలపు లేశము సుమతీ!
భావం: దుర్జన స్నేహము కూడదు. కీర్తి సంపాదించిన తరువాత తొలగిపోదు. అప్పునిచ్చుట కలహమునకు మూలము. స్త్రీలకు కొంచెమైనను ప్రేమ ఉండును.
నరపతులు మేరఁదప్పిన
దిర మొప్పగ విధవ యింటఁ దీర్పరియైనన్
గరణము వైదికుఁడయినను
మరణాంతక మౌనుగాని మానదు సుమతీ!
భావం: రాజులు ధర్మము యొక్క హద్దు తప్పినను; విధవాస్త్రీ ఇంటి యం ఏల్లకాలము పెత్తనము చేసినను, గ్రామకరణము పైదికవృత్తి గల వాడైనను ప్రానము పోవునంతటి కష్టము తప్పకుండా సంభవించును.
పగవల దెవ్వరితోడను,
వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్,
దెగనాడవలదు సభలను
మగువకు మన సియ్యవలదు మహిలో సుమతీ!
భావం: ఎటువంటి వారితోనూ పగపెట్టుకొనరాదు. బీదతనము సంభవించిన తరువాత విచారింపరాదు. సభలలో మోమాటములేకుండ మాట్లాడరాదు. స్త్రీకి, మనసులోని వలపు తెలుపరాదు.
పలుదోమి సేయు విడియము
తలగడిగిన నాఁటి నిద్ర, తరుణులతోడన్
పొలయలుక నాఁటి కూటమి,
వెల యింతని చెప్పరాదు వినురా సుమతీ!
భావం: దంతములు తోముకొనినవెంటవే వేసుకొను తాంబూలమును, తలంటుకొని స్నానముచేసిననాటి నిద్రయును, స్త్రీలతో ప్రనయకలహమునాడు కూడిన పొందును. వీటి విలువ ఇంతయని చెపలేము సుమా.
పులిపాలు దెచ్చియిచ్చిన
నలవడఁగా గుండెగోసి యరచే నిడినన్
దలపొడుగు ధనముఁబోసిన
వెలయాలికిఁగూర్మిలేదు వినరా సుమతీ!
భావం: పులి పాలు తెచ్చినను, గుండెకాయను కోసి అరచేతిలో బెట్టినప్పటికినీ, తలేత్తు ధనముపోసినప్పటికినీ, వేశ్యాస్త్రీకి ప్రేమ ఉండుదు.
మానధనుఁడాత్మదృతిఁచెడి
హీనుండగువాని నాశ్రయించుట యెల్లన్
మానెండు జలము లోపల
నేనుఁగు మెయిదాఁచినట్టు లెరుగుము సుమతీ!
భావం: అభిమానసంతుడు ధైర్యము తొలగి నీచుని సేవించుత కొంచెను నీళ్ళలొ ఏనుగు శరీరమును దాసుకొను విధముగా నుండును.
'రా, పొ'మ్మని పిలువని యా
భూపాలునిఁగొల్వ భుక్తి ముక్తులు గలపే ?
దీపంబు లేని యింటను
జే పుణికిళ్ళాడినట్లు సిద్ధము సుమతీ! 20
భావం: దీపములేని ఇంటిలోచేతిపట్టులాడిన పట్టుదొరకనియట్లే 'రమ్ము పొమ్ము 'అని ఆదరింపని రాజును సేవించుటవలన భూక్తిముక్తులుగల్గవు.
వెలయాలి వలనఁగూరిమి
గలుగదు మఱిఁగలిగెనేని కడతేరదుగా
బలువురు నడిచెడు తెరువునఁ
బులు మొలవదు మొలచెనేని బొదలదు సుమతీ!
భావం: పదుగురు నడిచే మార్గము నందు గడ్డి మొలవనే మొలవదు. ఒకవేళ కలిగినా, కడవరకు స్థరముగనుండదు. అట్లే వేశ్య ప్రేమించదు. ప్రేమించిననూ తుదివరకూ నిలువదు.
వెలయాలు సేయు బాసలు
వెలయఁగ నగసాలి పొందు, వెలమల చెలిమిన్.
గలలోఁన గన్నకలిమియు,
విలసితముగ నమ్మరాదు వినరా సుమతీ!
భావం: వేశ్యా ప్రమాణములును, విశ్వ బ్రాహ్మణుని స్నేహమును, వెలమ దొరల జతము, కలలో చూచిన సంపదయు, స్పష్టముగానమ్మరాదు.
పొరుగునఁ బగవాఁడుండిన
నిర నొందఁగ వ్రాఁతకాడె యేలికయైనన్
ధరఁగాఁపు గొండెయైనను
గరణులకు బ్రతుకులేదు గదరా సుమతీ!
భావం: ఇంటి పొరుగున విరోధి కాపురమున్ననూ, వ్రాతలో నేర్పరియైనవాడు పాలకుదైననూ, రైతు చాడీలు చెప్పెడివాడైననూ కరణములకు బ్రతుకుతెరు ఉండదు.
వురికిని బ్రాణము కోమటి
వరికిని బ్రాణంబు నీరు వసుమతిలోనన్
గరికిని బ్రాణము తొండము
సిరికిని బ్రాణంబు మగువ, సిద్ధము సుమతీ!
భావం: పట్టణమునకు కోమటియు, వరిపైరునకు నీరును, ఏనుగునకు తొండమును, సిరి సంపదలకు స్త్రీయును ప్రానము వంటివి.
వరిపంట లేని యూరును
దొరలుండని యూరు, తోడు దొరకని తెరువున్,
ధరను బతిలేని గృహమును,
నరయంగా రుద్రభూమి యనదగు సుమతీ!
భావం: వరిపంటలేని యూరును, అధికారియుండని గ్రామమును, తోడు దొరకని మార్గమును, యజమానుడులేని ఇల్లును వల్లకాడుతో సమానము.
వీడెము సేయని నోరును
చేడెల యధరామృతంబుఁజేయని నోరున్
బాడంగరాని నోరును
బూడిద కిరవైన పాడు బొందర సుమతీ!
భావం: తాంబూలము వేసికొననట్టియు, చెప్పిన మాట మరలాలేదని పల్కునట్టియు, పాటపాడుట తెదియనట్టిదియు అగునోరు, బూడిదమన్ను పోయునట్టి గుంటాతో సమానము. (1 చేడెల సుగుణములు మెచ్చి చెప్పనినోరున్ పా|| 2. "బొంద" గుంటూరు కృష్టామండలముల దూష్యార్ధం)
లావుగలవాని కంటెను
భావింపఁగ నీతిపరుఁడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటివాఁడెక్కినట్లు మహిలో సుమతీ!
భావం: కొండ అంతటి ఏనుగును మావటివాడెక్కి లోబరుచుకొనునట్లే లావు కలిగిన వాడికంటెను, నీతిగల్గినవాడు బలవంతుడగును.
పెట్టిన దినముల లోపల
నట్టడవులకైన వచ్చు నానార్ధములున్
బెట్టని దినముల గనకఁపు
గట్టెక్కిన నేమిలేదు గదరా సుమతీ. 30
భావం: పూర్వజన్మమున తాను దాన మిచ్చిన ఫలకాలమం దరణ్య మధ్య నున్నప్పటికినీ సకల పదార్ధములు కలుగును. పూర్వ జన్మమున దానమియ్యకున్నచో తాను బంగారుకొండ నెక్కినను ఏమియు లభించదు. ("యద్ధాతా నిజ పాలపిట్ట లిఖితమ్" అనుశ్లోకమునున కనుకరనము)
వఱదైన చేనుదున్నకు
కఱవైనను బంధుజనుల కడ కేఁగకుమీ,
పరులకు మర్మము సెప్పకు,
పిఱికికి దళవాయితనముఁబెట్టకు సుమతీ!
భావం: వరద వచ్చే పొలమును వ్యవసాయము చేయకుము, కరువు వచ్చినచొ చుట్టముల కరుగకుము. ఇతరులకు రహస్యము చెప్పకుము. భయము గలవాడికి సేనా నాయకత్వము నీయకుము.
బంగారు కుదువఁబెట్టకు
నంగడి వెచ్చము లాడకు,
సంగరమునఁ బాఱిపోకు, సరసుడవైతే
వెంగలితోఁ జెలిమివలదు వినురా సుమతీ!
భావం: బంగారము తాకట్టుపెట్తకుము. యుద్ధమునందు పారిపోకుము దుకాణము నందు వెచ్చములు అప్పు తీయకుము. అవివేకితో స్నేహము చేయకుము.
తలనుండు విషము ఫణికిని
వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్
తలతోక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!
భావం: తల యందు పామునకు, తోక నందు తేలునకును విషముండును, కాని, దుర్మార్గులకు తల, తోక యను నియమము లేక, శరీరమందంతటను విషముండును.
కనకపు సింహాసనమున
శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునం
దొనరగ బట్టము కట్టిన
వెనుకటి గుణమేల మాను వినురాసుమతీ!
భావం: కుక్కను బంగారపు గద్దెమీద కూర్చుండజేసి మంచి ముహూర్తమున పట్టాభిషేకముచేసిననూ, దానికి సహజమయిన యల్పగుణముమానదు అట్లే, నీచుడగువానిని యెంత గౌరవించినను, వాని నీచగుణము వదలడు.
శ్రీ రాముని దయచేతను
నారూఢిగ సకల జనుల నౌరాయనగా
ధారాళమైన నీతులు
నోరూరగ జవులుబుట్ట నుడివెద సుమతీ!
భావం: సుమతీశతక కారుడు 'సుమతీ' అని సంబోధన చేసి బుద్ధిమంతులకు మాత్రమే నీతులను చెప్పెదనని తెలిపినాడు. లోకములోనీతి మార్గమును ఆచరించి బోధించిన శ్రీరాముని అనుగ్రహము పొందిన వాడనై లోకులు మెచ్చుకొను నట్టి మరలమరల చదువ వలెను అనే ఆశకలుగునట్లుగా వచించుచున్నాను.
అప్పుగొని చేయు విభవము
ముప్పున బ్రాయంపుటాలు, మూర్ఖుని తపమున్
ద ప్పరయని నృపురాజ్యము
దెప్పరమై మీద గీడు దెచ్చుర సుమతీ!
భావం: అప్పులు చేసి ఆడంబరములు చేయడం ముసలితనములో వయసులొనున్న భార్య ఉండటం మూర్ఖుని తపస్సు. తప్పొప్పులను గుర్తించని రాజ్య పరిపాలన ముందు ముందు భయం కరమైన కష్టమును కలిగించును.
ఆకలి యుడుగని కడుపును
వేకటియగు లంజపడుపు విడువని బ్రతుకున్,
బ్రా కొన్న నూతి యుదకము
మేకల పాడియును రోత మేదిని సుమతీ!
భావం: కడుపునిండని తిండి, గర్భము దాల్చికూడ అంజరికము మానని భొగము దాని జీవితము, పాచిపట్టిపాడయిన బాలినీరు, మేక కలిచ్చేపాడి రోతకలిగిస్తాయి.
ఉత్తమగుణములు నీచున
కెత్తెఱుగున గలుగనేర్చు నెయ్యడలన్ దా
నెత్తిచ్చి కఱగబోసిన
నిత్తడి బంగార మగునె యిలలో సుమతీ!
భావం: బంగారముతో సమానముగా తూచి కరగించి కడ్డీలుగ పోసినప్పటికీ ఇత్తడి బంగారముతో సమానముకాదు. అదేవిధముగా నీచుడెంత ప్రయత్నించిన ఉత్తమ గుణములను పొందలేడు.
ఉపకారికి నుపకారము
విపరీతముగాదుసేయ వివరింపంగా
నపకారికి నుపకారము
నెపమెన్నక జేయువాడె నేర్పరి సుమతీ!
భావం: ఊపకారము చేసిన వానికి తిరిగి ఉపకారము చేయడం గొప్పవిషయం కాదు. కీడు చేసిన వాని తప్పులు లెక్కపెట్టకుండ ఉపకారము చేయుటే తెలివైనపని.
ఎప్పుడు దప్పులు వెదకెడు
నప్పురుషుని గొల్వగూడ దదియెట్లన్నన్
సర్పంబు పడగనీడను
గప్పవసించు విధంబు గదరా సుమతీ! 40
భావం: ఎప్పుడు కూడ తన తప్పులను వెదకే అధికారిని కొలువ రాదు. తనను చంపటానికి ప్రయత్నించు పాము పడగ నీడన కప్ప నిలబడటానికి ప్రయత్నించకూడదు. ఈ రెండుకార్యములు కష్టమును కలిగించును.
ఒక యూరికి నొక కరణము
నొక తీర్పరియైనదక నొగి దఱుచైననౌ
గకవికలు గాకయుండునె
సకలంబును గొట్టుపడక సహజము సుమతీ!
భావం: ఒక గ్రామమునకు ఒక కరణమును, ఒక న్యాయాధికారియునుగాక, క్రమముగా యెక్కువ మంది యున్నచో నన్ని పనులు చెడిపోయి చెల్లాచెదురు గాక యుండునా? (ఉండవు.)
వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
గని కల్ల నిజము దెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!
భావం: ఎవ్వరు చెప్పిననూ వినవచ్చును. వినగానే తొందర పడక నిజమో అబద్ధమో వివరించి తెలిసికొనినవాడే న్యాయము తెలిసినవాడ.
తన కోపము తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తధ్యము సుమతీ!
భావం: తన యొక్క కోపము శత్రువువలె బాధయును, నెమ్మది తనము రక్షకునివలె రక్షనయును, కరున చుట్టమువలె ఆదరమును, సంతోషము స్వర్గమువలె సుఖమును, దుఃఖము నరకమువలె వేదనను కగించునని చెప్పుదురు.
మాటకు ప్రాణము సత్యము
కోటకు ప్రాణంబు సుభటకోటి ధరిత్రిన
బోటికి ప్రాణము మానము
చీటికి ప్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ!
భావం: మాతకు సత్యమును; కొటకు మంచి భటుల సమూహమును, స్త్రీకిసిగ్గును, ఉత్తరమునకు చేవ్రాలు(సంతకము) జీవములు(ప్రాణమువలె ముఖ్యమైనవి.)
సిరి తా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరి తా పోయిన పోవును
కరిమ్రింగిన వెలగపండు కరణిని సుమతీ!
భావం: సంపద కలుగునపుడు కొబ్బరి కాయలోనికి నీరువచ్చు విధముగానే రమ్యముగా కలుగును. సంపదపోవునపుడు ఏనుగు మ్రింగిన వేలగపండులోని గుంజు మాయమగు విధముసనే మాయమయిపొవును.
కరణముల ననుసరింపక
విరిసంబున దిన్నతిండి వికటించు జుమీ
యిరుసున గందెన బెట్టక
పరమేశ్వరుబండియైన బాఱుదు సుమతీ!
భావం: కందెన లేనట్లయితే ఏ విధముగా దేవుని బండియైన కదలదో అదే విధముగా కరణానికి ధనమిచ్చి అతనికి నచ్చినట్లు నడవకున్నట్లయితె తన స్వంత ఆస్తికే మోసమువస్తుంది.
అక్కరకు రాని చుట్టము,
మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమునcదా
నెక్కిన బాఱని గుఱ్ఱము,
గ్రక్కున విడువcగవలయcగదరా! సుమతీ.
భావం: సమయమునకు సహాయముచేయని చుట్టమును, నమస్కరించి ననూ వరములీయని దైవమును, యుద్ధములో తానెక్కగా పరుగెత్తని గుర్రమును వెంటనే విడువ వలయును.
అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరనుcగొల్చి మిడుకుట కంటెన్.
వడిగల యెద్దులcగట్టుక
మడి దున్నుక బ్రతుకవచ్చు మహిలో సుమతీ.
భావం: అడిగిన జీతమీయని ప్రభువును సేవించి కష్తపడుట కన్న, వడిగల యెద్దులను గట్టుకొని పొలము దున్నుకొని జీవించుటయే మేలు.
అడియాస కొలువుcగొలువకువ,
గుడిమణియము సేయcబోకు, కుజనుల తోడన్
విడువక కూరిమి సేయకు
మడవినిడిcదో డరయ కొంటి నరుగకు సుమతీ. 50
భావం: వ్యర్ధమైన యాశగల కొలువును, దేవాలయము నందలి యధికారము, విడువకుండా చెడ్డవారితో స్నేహమును, అడవిలో తోడులేకుండక ఓంటరిగా పోవుటయును తగినవికావు. (కనక, వాటిని మానివేయవలెను.)
అప్పిచ్చువాడు, వైద్యుడు,
నెప్పుడు నెడతెగక బాఱు నేఱును, ద్విజుcడున్,
జొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతీ.
భావం: అప్పులిచ్చు వాడను, వైద్యుడును, యెడతెగక కుండా నీరు పారచుండెడి నదియును, బ్రాహ్మణుడును ఇవియున్న వూరిలో నివసింపుము. ఇవిలేని వూరును ప్రవేశింపకుము.
అల్లుని మంచితనంబును,
గొల్లని సాహిత్యవిద్య, కోమలి నిజమున్,
బొల్లున దంచి బియ్యము,
దెల్లని కాకులును లేవు తెలియుము సుమతీ.
భావం: అల్లుడు మంచిగా నుండుట, గొల్ల విద్వాంసుడౌట, ఆడుది నిజము చెప్పుట, పొల్లున దంచిన బియ్యము, తెల్లనికాకులును లొకములోలేవని తెలియవలయును.
ఆcకొన్న కూడె యమృతము,
తాcగొంకక నిచ్చువాcడె దాత ధరిత్రిన్,
సో కోర్సువాcడె మనుజుcడు,
తేcకువగలవాడె వంశ తిలకుcడు సుమతీ.
భావం: ఆకలిగా నున్నప్పుడు తిన్న యన్నమే అమృతము వంటిది. వెనుక ముందు లాడక నిచ్చువాడే దాత, కష్తములు సహించువాడే మనుష్యుడు, ధైర్యము గలవాదే కులమునందు శ్రేష్ఠుడు.
ఇమ్ముగcజదువని నోరును,
'అమ్మా' యని పిలిచి యన్న మడుగని నోరున్,
దమ్ములcమబ్బుని నోరును
గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ.
భావం: ఇంపుగా చదువని నోరును, 'అమ్మా'యని పిలిచి అన్నమడుగని నోరును, ఎన్నడునూ తాంబూలము వేసుకొనని నోరును, కుమ్మరిమన్నుకై త్రవ్విన గుంటతో సమానము.
ఉడుముండదె నూఱేండ్లునుc
బడియుండదె పేర్మిcబాము పదినూఱేండ్లున్
మడుపునcగొక్కెర యుండదె
కడునిలcబురుషార్దపరుcడు గావలె సుమతీ.
భావం: ఉడుము నూఱేండ్లును, పాము వెయ్యేండ్లును, కొంగ మడుగులో బహు కాలమును జీవించును. కాని, వాటివలన ప్రయోజన మేమి? మంచి పనులయంద అసక్తిగలవాడుండిన ప్రయోజనమగును.
ఉపమింప మొదలు తియ్యన
కపటంబెడ నెడను, జెఱకు కైవతినే పో
నెపములు వెదకునుcగడపటc
గపటపు దుర్జాతి పొందు గదరా సుమతీ.
భావం: పోల్చికొని చూడగా, చెఱకు గడ మొదలు తియ్యగా నుండి నడుమ తీపితగ్గి చివరకు చప్పబడునట్లే, చెడు స్నేహము మొదట యింపుగాను, నడుమ వికటముగానూ చివరకు చెరువు గలిగించునదిగనూ యుండును.
ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటి కా మాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తా నొవ్వక
తప్పించుక తిరుcగువాcడు ధన్యుcడు సుమతీ.
భావం: ఏ సమయమునకు ఏది తగినదో, అప్పటికి ఆ మాటలడి, ఇతరుల మనస్సులు నొప్పింపక, తాను బాధపదక, తప్పించుకొని నడచుకొనువాడే కృతార్ధుడు.
ఎప్పుడు సంపద గలిగిన
నప్పుడు బంధువులు వత్తు రది యెట్లన్నన్
దెప్పులుగc జెఱువు నిండినc
గప్పలు పదివేలుచేరుcగదరా సుమతీ.
భావం: చెఱువులొ తెప్ప లాడునట్లు నీరు నిండుగా నున్నచొ, కప్ప అనేకములు చేరును. అట్లే భాగ్యము గలిగినప్పుడే చుట్టములు వత్తురు.
ఒల్లని సతి నొల్లని పతి
నొల్లని చెలికాని విడువ నొల్లనివాడే
గొల్లండుcగాక ధరలో
గొల్లడును దొల్లడౌనె చుణమున సుమతీ.
భావం: ఇష్టపడని భార్యను, విశ్వాసములేని యజమానుని, ఇష్తపడని స్నేహితుని, విడచుత, కిష్టపడనివాడే గొల్లవాని, గొల్ల కులము నందు పుట్టిన మాత్రమున గొల్లకాడు.
ఓడలcబండ్లును వచ్చును
ఓడలు నా బండ్లమీcద నొప్పుగ వచ్చున్
ఓడలు బండ్లును వలెనే
వాడగబడుcగలిమిలేమి వసుధను సుమతీ. 60
భావం: ఓడలమీద బండ్లును, బండ్లమీద ఓడలును వచ్చును. అట్లే ఐశ్వర్యము వెంట దారిద్ర్యమును, దారిద్ర్యము వెంట ఐశ్వర్యమును వచ్చుచుండును.
కమలములు నీరు బాసినc
గమలాప్తు రశ్మిసోకి కమలిన భంగిన్
దమతమ నెలవులు దప్పినc
దమ మిత్రులే శత్రులౌట తధ్యము సుమతీ.
భావం: కమలములు తమ స్థానమగు నీటిని వదలిన యెడల తమకు మిత్రుడగు సూర్యని వేడి చేతనే వాదిపోవును. అట్లే, ఎవరుగాని తమ తమ యునికినట్లు విదిచినచో తమ స్నేహితులే విరోధు లగుట తప్పదు.
కారణములేని నగవునుc
బేరణమునులేని లేమ పృధివీ స్ధలిలోc
బూరణములేని బూరెయు
వీరణములులేని పెండ్లి, వృధరా సుమతీ.
భావం: కారనములేని నవ్వును, రవికలేక స్త్రీయును, పూరణములేని బూరెయును, వాయిద్యములు లేని పెండ్లియును గౌరవములేక యుండును.
కులకాంతతోcడ నెప్పుడుc
గలహింపకు, వట్టితప్పు ఘటియింపకుమీ
కలకంఠకంఠి కన్నీ
రొలికిన సిరి యింటనుండ నొల్లరు సుమతీ.
భావం: భార్యతో ఎప్పుడూ జగడమాడరాదు, లేనితప్పులు మొపరాదు. పతివ్రతయైన స్త్రీ యొక్క కంటినీరు ఇంట పడినచో, ఆ ఇంటి యందు సంపద వుండబోదు.
కూరిమిగల దినములలో
నేరము లెన్నcడునుc గలుగనేరవు, మఱి యా
కూరిమి విరసంబైనను,
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ.
భావం: స్నేహము గల దినములలో ఎన్నడునూ తప్పులు కనబడవు. ఆ స్నేహము విరోధమైనచో ఒప్పులే తప్పులుగా నగపడుచుండును.
కొంచెపు నరు సంగతిచే
నంచితముcగ గీడువచ్చునది యెట్లన్నన్
గించిత్తు నల్లి కఱచిన
మంచమునకుc బెట్లు వచ్చు మహిలో సుమతీ.
భావం: చిన్ననల్లి కరిచినచో మంచమునకే విధముగా దెబ్బలు కలుగునో, అట్లే నీచునితో స్నేహము చేసినచో కీడు కలుగును.
చింతింపకు కడచిన పని
కింతులు వలతురని నమ్మ కెంతయుమదిలో
నంతఃపుర కాంతులతో
మంతనముల మానుమిదియె మతముర సుమతీ.
భావం: జరిగిపోయిన పనికి విచారింపకుము. స్త్రీలు ప్రేమింతురని నమ్మకము. రాణి వాస స్త్రీలతో రహస్యా అలొచనములు చేయకుము. ఇదియే మంచి నడవడి సుమా.
చీమలు పెట్టినా పుట్టలు
పాముల కిరువైన యట్లు పామరుcడుదగన్
హేమంబుcగూడcబెట్టిన
భూమీశుల పాలcజేరు భువిలో సుమతీ.
భావం: చీమలు పెట్టిన పుట్టలు పాములకు నివాసమయిన విధముగానే లోభి దాచి ధనము రాజుల పాలగును.
చేతులకు తొడవు దానము,
భూతలనాథులకుc దొడవు బొంకమి ధరలో
నీతియె తోడ వెవ్వారికి
నాతికి మాలంబు తొడవు నయముగ సుమతీ.
భావం: చేతులకు దానము; రాజుల కబద్ధ మాడకుండుటయును; ధరణిలో నెవ్వరికైనను న్యాయము; స్త్రీకి పాతివ్రత్యమును అలంకారము.
ననుభవింప నర్ధము
మానవపతి జేరు గొంత మఱి భూగతమౌ
గానల నీగలుగూర్చిన
తెనియ యొరు జేరునట్లు తిరముగ సుమతీ.
భావం: నిజముగా తేనెటీగలు అడవులలో చేర్చి ఉంచిన తేనె ఇతరలకు యెట్లు చేరునొ; అట్లే తాము భోగింపక దాచియుంచిన ధనముకొంత రాజులకు చేరును. మరికొంత భూమి పాలగును.
ధీరులకుc జేయు మేలది
సారంబగు నారికేళ సలిలము భంగిన్
గౌరవమును మఱి మీcదట
భూరిసుఖావహము నగును భువిలో సుమతీ. 70
భావం: కొబ్బరిచెట్టుకు నీరుపోసినచో శ్రేష్టమైన నీరుగల కాయలను యిచ్చును. అట్లే బుద్ధిమంతులకు జేసిన ఉపకారము మర్యాదయును, తరువాత మిక్కిలి సుఖములను గల్గించును.
నడువకుమీ తెరువొక్కటc
గుడువకుమీ శత్రునింట గూరిమితోడన్,
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ.
భావం: మార్గము నందు ఒంటరిగా నడవకుము, పగవాని ఇంటి యందు స్నేహముతో భూజింపకుము. ఇతరుల ధనమును మూట గట్టకము ఇతరుల మనస్సు నొచ్చునట్లు మాటలాడకుము.
నయమున బాలుం ద్రావరు
భయమునను విషమ్మునైన భక్షింతురుగా
నయమెంత దోసకారియొ
భయమే చూపంగవలయు బాగుగ సుమతీ.
భావం: మంచితనమువల్ల పాలను సహితము త్రాగరు. భయపెట్టుట చేత విషము నైనను తిందురు. కావున భయమును చక్కగా చూపించ వలయును.
నమ్మకు సుంకరి, జూదరి,
నమ్మకు మగసాలి వాని, నటు వెలయాలిన్,
నమ్మకు మంగడివానిని,
నమ్మకుమీ వామహస్తు నవనిని సుమతీ.
భావం: పన్నులు వసూలు చేయువానిని, జూదమాడు వానిని, కంసాలిని, భోగము స్త్రీని, సరుకులమ్మువారిని, ఎడమచేతితో పనిచేయువానిని, నమ్మకుము.
నవ్వకుమీ సభలోపల
సవ్వకుమీ తల్లిదండ్రి నాధులతోడన్,
నవ్వకుమీ పరసతులతో
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ.
భావం: సభలోపలను, తల్లిదండ్రులతోడను, అధికారుల తోడను, పరస్త్రీ తోడను, బ్రాహ్మణా శ్రేష్టులతోడను పరిహాసము లాదకుము.
పతికడకుc, తనుc గూర్చిన
సతికడకును, వెల్పుcకడకు, సద్గురు కడకున్
సుతుకడకును రిత్తచేతుల
మతిమంతులు చనరు, నీతి మార్గము సుమతీ.
భావం: నీతి ప్రవర్తన గలవారు, రాజు దగ్గరకును, తనను ప్రేమించిన భార్య దగ్గరకును, దేవుని సముఖమునకును, గురువు కడకును, కుమారుని దగ్గరకును వట్టి చేతులతో వెళ్ళరు.
పరసతి కూటమిc గోరకు,
పరధనముల కాసపడకు, పరునెంచకుమీ,
సరిగాని గోష్టి చేయకు,
సిరిచెడి చుట్టంబుకడకు జేరకు సుమతీ.
భావం: పరసతుల పొందు గొరకుము. ఇతరిఉల భాగ్యమున కాసపడకుము. పరుల తప్పు లెంచకుము. తగనటువంటి ప్రసంగము చేయకుము. ఐశ్వర్యము కొల్పోయిన కారణముగా బంధువుల వద్దరు వెళ్ళకుము.
పరుల కనిష్టము సెప్పకు
పొరుగిండ్లకుc బనులు లేక పోవకు మెపుడున్
బరుc గలిసిన సతి గవయకు
మెరిcగియు బిరుసైన హయము నెక్కకు సుమతీ.
భావం: ఇతరులకు యిష్టముగానిదానిని మాట్లాదబొకుము పనిలేక ఇతరుల ఇండ్ల కెన్నడుగా వెళ్ళకుము. ఈతరులు పొందిన స్త్రీని పొందకుము. పెంకితనము గలిగిన గుఱ్ఱము నెక్కకుము.
పర్వముల సతుల గవయకు,
ముర్వీశ్వరు కరుణ నమ్మి యుబ్బకు మదిలో,
గర్వింపc నాలి బెంపకు,
నిర్వాహము లేనిచోట నిలువకు, సుమతీ.
భావం: పుణ్య దినము లందు స్త్రీలను పొందకుము. రాజు యొక్క దయను నమ్మి పొంగకుము. గర్వించు నట్లుగా భార్యను పోషింపకుము. బాగుపడలేనిచోట యుండకుము.
పాలను గలసిన జలమును
బాలవిధంబుననె యుండు బరికింపంగా,
బాలచవిc జెరుచు, గావున
తాలసుcడగువానిపొందు వలదుర సుమతీ.
భావం: పాలతో గలిపిన నీరు పాల విధముగానే యుండును. కాని శోధించిచూడగా పాలయొక్క రుచిని పోగొట్టును. అట్లేచెడ్దవారితోస్నహము చెసిన మంచి గుణములు పోవును. కావున, చెడ్డావారితో స్నేహము వద్దు.
పాలసునకైన యాపద
జాలింపబడి తీర్చదగదు సర్వజ్ఞువకున్
దే లగ్ని బడగ బట్టిన
మేలెరుగునె మీటుగాక మేదిని సుమతీ. 80
భావం: అన్నియును తెలిసిన వాడయినను; తేలు నిప్పులొ బడినపుడు విచారమునొంది, దానిని రక్షించుటకై పట్టుకొన్నచొ, అది మేలు నెంచక కుట్టును. అట్లే, దుర్జనునకు కీడు వచ్చినప్పుడు జాబితో రక్షించినచో వాడు తిరిగి కీడు చేయును.
పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా
పుత్రుని గనుకొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొదుర సుమతీ.
భావం: తండ్రికి కుమారుడు పుట్టగానే పుత్రుడు గల్లుట వలన వచ్చు సంతోషము గలుగదు. ప్రజలు ఆ కుమారుని జూచి మెచ్చిన రోజుననే ఆ సంతోషము కలుగును.
పెట్టిన దినముల లోపల
నట్టడవులకైన వచ్చు నానార్థములున్
బెట్టని దినములc గనకపు
గట్టెక్కిన నేమిలేదు గదరా సుమతీ.
భావం: పూర్వ జన్మమున తాను దాన మిచ్చిన ఫలకాలమం దరణ్య మధ్య నున్నప్పటికినీ సకల పదార్ధములు కలుగును. పూర్వ జన్మమున దానమియ్యకున్నచొ తాను బంగారుకొండ నెక్కినను ఏమియు లభించదు. ("యద్ధాతా నిజ ఫాలపట్ట లిఖితమ్" అనుశ్లోకమును కనుకరణము)
పొరుగునc బగవాడుండిన
నిరనొందcగ వ్రాcతకాcడె యేలికయైనన
ధరగాcపు గొండెయైనను
గరణులకు బ్రతుకులేదు గదరా సుమతీ.
భావం: ఇంటి పొరుగున విరోధి కాపురమున్ననూ, వ్రాతలొ నేర్పరియైనవాడు పాలకుడైననూ, రైతు చాడీలు చెప్పెడి వాడైననూ కరణములకు బ్రతుకుతెరు వుండదు.
బంగారు కుదవc బెట్టకు
నంగడి వెచ్చము లాడకు,
సంగరమునc బాఱిపోకు, సరకుడవైతే
వెంగలితోc జెలిమివలదు వినరా సుమతీ.
భావం: బంగారము తాకట్టుపెట్టకుము. యుద్ధమునందు పారిపోకుము దుకాణము నందు వెచ్చములు అప్పు తీయకుము. అవివేకితో స్నేహము చేయకుము.
బలవంతుcడ నాకేమని
బలువురతో నిగ్రహించి పలుకుటమేలా
బలవంతమైన సర్పము
చలిచీమల చేతcజిక్కి చావదె సుమతీ.
భావం: బలము కలిగిన పాము ఐనప్పటికినీ చలి చీమలచేత్ బట్టుబడిచచ్చును. అట్లే దాను బలవంతుడనే గదా అని అనేకులతొ విరోధ పడెనేని తనకే కీడు వచ్చును.
మండలపతి సముఖంబున
మెండైన ప్రధానిలేక మెలగుట యెల్లన్
గొండంత మదపుటేనుcగు
తొండము లేకుండినట్లు తోచుట సుమతీ.
భావం: కొండంత ఏనుగునకు తొండములేనిచో ఎట్లునిరర్ధకమొ, అట్లే రాజుయొక్క సముఖన సమర్ధతగల మంత్రిలేనిచో రాజ్యము నిరర్ధకము.
మాటకుc బ్రాణము సత్యము,
కోటకుc బ్రాణంబు సుభట కోటి, ధరిత్రిన్
బోటికిc బ్రాణము మానము,
చిటికిc బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ.
భావం: మాతకు సత్యమును; కొతకు మంచి భటుల సమూహమును, స్త్రీకిసిగ్గును, ఉత్తరమునకు చేప్రాలు (సంతకము) జీవనములు(ప్రాణము వలె ముఖ్యమైనవి.)
మానధను డాత్మధృతి చెడి
హీనుండగువాని నాశ్రయించుట యెల్లన్
మానెండు జలము లోపల
నేనుగు మెయిదాచినట్టు లెరుగుము సుమతీ.
భావం: అభిమానసంతుడు ధేర్యము తొలగి నీచుని సేవించుత కొంచెము నీళ్ళలో ఏనుగు శరీరమును దాసుకొను విధముగా నుండును.
మేలెంచని మాలిన్యుని,
మాలను, నగసాలెవాని, మంగలిహితుగా
నేలిన నరపతి రాజ్యము
నేల గలసిపోవుగాని నెగడదు సుమతీ.
భావం: ఉపకారము తలపొయవి పాపాత్ముని, మాలను, కంసాలిని, మంగలిని వీరలను స్నేహితులుగా చేసుకున్న రాజుయొక్క రాజ్యము నశించునే గాని వృద్ధి పొందరు.
రూపించి పలికి బొంకకు,
ప్రపగు చుట్టంబు కెగ్గు పలుకకు, మదిలో
గోపించు రాజుc గొల్వకు
పాపపు దేశంబు సొరకు, పదిలము సుమతీ. 90
భావం: రూఢి చేసి మాట్లాడిన తరువాత అబ్ధమాడకుము. సహాయముగా నుండు బంధువులకు కిడు చేయకుము. కోపించే రాజును సేవింపకుము. పాపాత్ము లుండెడి దేశమునకు వెళ్ళకుము.
వఱదైన చేను దున్నకు
కఱవైనను బంధుజనులకడ కేగకుమీ,
పరులకు మర్మము సెప్పకు,
పిఱికికి దళవాయితనము బెట్టకు సుమతీ.
భావం: వరద వచ్చే పొలమును వ్యవసాయము చేయకుము, కరువు వచ్చినచొ చుతముల కరుగకుము. ఇతరులకు రహస్యము చెప్పకుము. భయము గలవాడికి సేవా నాయకత్వము నీయకుము.
వరిపంటలేని యూరును,
దొరలుండని యూరు, తోడు దొరకని తెరువున్,
ధరను బతిలేని గృహమును,
నరయంగా రుద్రభూమి యనదగు సుమతీ.
భావం: వరిపంటలేని యూరును, అధికారియుండని గ్రామమును, తోడుదొరకని మార్గమును, యజమానుడులేని ఇల్లును వల్లకాడుతో సమానము.
వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపcదగున్
గని కల్ల నిజము దెలిసిన
మనుజుcడెపో నీతిపరుcడు మహిలో సుమతీ.
భావం: ఎవ్వరు చెప్పిననూ వినపవచ్చును. వినగానే తొందర పడక నిజమో అబ్ధమో వివరించి తెలిసికొనినవాడే న్యాయము తెలిసినవాడ.
సరసము విరసము కొఱకే
పరిపూర్ణ సుఖంబు లధిక బాధల కొఱకే
పెరుగుట విరుగుట కొఱకే
ధర తగ్గుట హెచ్చు కొరకె తథ్యము సుమతీ.
భావం: హాస్యము లాడుట నిరోధము గల్గుటకే, మిక్కిలి సౌఖ్యములనుభవించుట పెక్కు కష్తముల నొందుటకే, అధికముగా పెరుగుట విరుగుతకొరకే, ధర తగ్గుట అధికమగుత. నిజమగు కారణము లగును.
సిరిదా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరిదాcబోయిన బోవును
కరి మ్రింగిన వెలగపండు కరణిని సుమతీ.
భావం: సంపద కలుగునప్పుడు కొబ్బరి కాయలొనికి నీరువచ్చు విధముగానే రమ్యముగా కలుగును. సంపదపోవునపుడు ఏనుగు మ్రింగిన వెలగపండులోని గుంజు మాయమగు విధముసనే మాయమయిపోవును.
స్త్రీలయెడల వాదులాడకు
బాలురతోc జెలిమిచేసి భాషింపకుమీ
మేలైన గుణము విడువకు
ఏలిన పతి నిందసేయ కెన్నడు సుమతీ.
భావం: ఎన్నడును స్త్రీలతో వివాదములాడకుము, బాలురతో స్నేహము చేసి మాటలాడకుము, మంచి గుణములు వదలకుము; పాలించు యజమానుని దూషింపకుము.
తన కోపమే తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌc
తన సంతోషమె స్వర్గము
తనదుఖఃమె నరక మండ్రు, తథ్యము సుమతీ.
భావం: తన యొక్క కోపము శత్రువు వలె భాధయును, నెమ్మది తనము రక్షకునివలె రక్షయును, కరున చుట్టమువలె ఆదరమును, సంతోషము స్వర్గములవలె సుఖమును, దుఃఖము నరకమువలె వేదనను కల్గించునని చెప్పుదురు.
దగ్గర కొండెము సెప్పెడు
ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుడై మఱి తా
నెగ్గు బ్రజ కాచరించుట
బొగ్గులకై కల్పతరువు బొడుచుట సుమతీ.
భావం: దగ్గర నున్న మంత్రి చెప్పు చాడీఈలను విని; రాజు యిష్టపడి; ప్రజలకు కీడు చేయుట అనునది; కోరిన కోరికల నిచ్చు చెట్టును బొగ్గులకై నరకుటతో సమానముగా నుండును.
మంత్రిగలవాని రాజ్యము
మంత్రము సెడకుండ నిలుచుc దరుచుగ ధరలో
మంత్రి విహీనుని రాజ్యము
జంత్రపుంగీ లూడినట్లు జరుగదు సుమతీ.
భావం: మంత్రి యున్న రాజు యొక్క రాజ్యము, కట్టుబాటు చెడిపోకుండా జరుగును. మంత్రి లేని రాజు యొక్క రాజ్యము కీలూడిన యంత్రము వలె నడువదు.
లావుగల వానికంటెను
భావింపగ నీతిపరుడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటివాc డెక్కినట్లు మహిలో సుమతీ. 100
భావం: కొండ అంతటి ఏనుగును మావటివా డెక్కి లోబరచుకొనునట్లే లావుగలిగిన వాడికంటెను, నీతిగల్గినవాడు బలవంతుడగును.
చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
కొంచమైన నదియు గొదవుగాదు
విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: మంచి మనసుతొ చేసిన చిన్న పనియైన మంచి ఫలితాన్నిస్తుంది. పెద్ద మర్రిచెట్టుకి కూడ విత్తనము చిన్నదేకదా!
ఆత్మశుద్ధి లేని యాచారమది యేల
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్దిలేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: మనసు నిర్మలముగా లేనట్లయితే ఆచారములు పాతించతంవల్ల ప్రయోజనం లేదు. పాత్రలు శుభ్రముగాలేని వంట, మనసు స్థిరముగా లేని శివ పూజ వ్యర్థములే అవుతాయి. ఏమీ ప్రయోజనముండదు.
గంగిగోవుపాలు గరిటెడైనను చాలు
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: కడివెడు గాడిదపాలకంటె గరిటెడు ఆవుపాలు మేలును కలిగించును. భక్తితో పెట్టిన కూడు పట్టెడు అయినప్పటికి తృప్తిని కలిగిస్తుంది.
నిక్క మైన మంచినీల మొక్కటి చాల
తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల?
చాటుపద్యములను చాలదా ఒక్కటి
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: తట్టెడు గులకరాళ్ళ కంటె ఒకమంచి నీలము శ్రేష్ఠము. అదే విధముగ వ్యర్ధమైన పద్యముల వంటె ఒక చక్కని చాటు పద్యము శ్రేష్ఠమవుతుంది.
మిరపగింజచూడ మీద నల్లగనుండు
కొరికిచూడు లోనచురుకు మనును
సజ్జను లగునారి సారమిట్లుండురా
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: మిరియపుగింజ మీద నల్లగానుప్పటికి దానిని కొరికిన వెంటనే చురుక్కుమంటుంది. మంచి వారు పైకి ఏవిధముగా కనిపించినప్పటికీ అతనిని జాగ్రత్తగా గమనించినచో అసలు విషయము బయటపడుతుంది.
మృగమదంబు చూడ మీఁద నల్లగనుండు
బరిఢవిల్లు దాని పరిమళంబు
గురువులైన వారి గుణము లీలాగురా
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: కస్తూరి చూడటానికి నల్లగా ఉన్నప్పతికి దాని సువాసన నాలుగు దిక్కులకు వెదజల్లునట్లు పెద్దలైన వారు బయటికి ఆడంబరముగ కనపడక గొప్ప గుణములు కలవారై ఉండురు.
మేడిపండు చూడ మేలిమై యుండు
పొట్టవిప్పి చూడ పురుగులుండు
బిరికి వాని మదిని బింకమీలాగురా
విశ్వ దాభిరామ! వినుర వేమ!
భావం: అత్తిపండు పైకందముగా కనపడుతుంది. దానిలొపల పురుగులుంటాయి. అదే విధముగ పిరికి వాని ధేర్యము కూడ పైన పటారము లొన లొటారముగ ఉంటుంది.
నేర నన్నవాఁడు నెరజాణ మహిలోన
నేర్తునన్న వాఁడు నింద జెందు
ఊరుకున్న వాఁడె యుత్తమయోగిరా
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: తనను ఏమీ రాదు అని చెప్పుకొనే వాడు నిజముగా తేలివైనవాడు. అన్నీ వచ్చుటకు చెప్పువాడు గౌరవాన్ని పొందలేడు. మౌనముగానున్నవాడే ఉత్తమ యౌగి అనిపించుకొంటాడు.
గంగ పాఱు నెపుడు కదలని గతితోడ
ముఱికి వాగు పాఱు మ్రోఁతతోడ
పెద్ద పిన్నతనము పేరిమి యీలాగు
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: గొప్పదైన గంగానది కూడ ప్రశాంతంగా ప్రవహిస్తుంది. చిన్నదైన మురికి కాలువ పెద్ద శబ్ధం చేస్తూ ప్రవహిస్తుంది. గొప్పవారికి, నీచునికి ఈ రకమైన భేదమే ఉన్నది.
నిండునదులు పారు నిల్చి గంభీరమై
వెఱ్ఱివాగు పాఱు వేగబొర్లి
అల్పుడాడు రీతి నధికుండు నాడునా
విశ్వదాభిరామ! వినుర వేమ! 10
భావం: ఓ వేమా ! నీటితో నిండియున్న నదులు గంభీరముగ నిల్లిచి ప్రవహించుచుండును. చిన్న సెలయేరులు పైకి పొర్లి వేగముగ ప్రవహించుచుండును. చెడ్డగుణములు గలవారు మాటలాడినంతటి తొందరగా, మంచిగుణములు గలవారు మాట్లాడరు.
అల్పుడెపుడు పల్కు నాడంబరము గాను
సజ్జనుండు బల్కు చల్లగాను
కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా
విశ్వ దాభిరామ! వినుర వేమ!
భావం: ప్రపంచములొ ఉన్న జనులకు ప్రియమైన పలుకులతో ఆనందము కలిగించు వేమనా! అల్పుడు శాంతముతో మాట్లాడతాడు. కంఛు ధ్వని చేసినట్లుగా బంగాము ధ్వని చేయదుకదా! అల్పుడు కంచుతోనూ, సజ్జనుడు బంగారముతోనూ సమానము.
కులము లోన నొకడు గుణవంతుడుండిన
కులము వెలయు వాని గుణము చేత
వెలయు వనములోన మలయజంబున్నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: కులములో ఒక వ్యక్తి గుణవంతుడన్నట్లయితే ఆ కులమంతా అతనివలన గౌరవాన్ని పొందుతుంది. వనములో ఒక్క మంచి గంధపు చెట్టు ఉన్నప్పటికీ ఆ వనమంతా వాసన వెదజల్లుతుంది.
పూజకన్న నెంచ బుద్ధి నిదానంబు
మాటకన్న నెంచ మనసు దృఢము
కులముకన్న మిగుల గుణము ప్రధానంబు
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: పూజపునస్కారముల కంటె బుద్ధి ప్రధానము. మాటకంటె మనసు ప్రధానము. కులముకంటె గుణము ప్రధానము.
ఉత్తముని కడుపున నోగు జన్మించిన
వాఁడె చెఱకు వాని వంశమెల్లఁ
జెఱకు వెన్నుపుట్టి చెరపదా! తీపెల్ల
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: చెరకు మొక్క చివర కంకిపుట్టి చెరకు యొక్క తీపిని చెరచునట్లుగా, ఉత్తమ వంశములో దుష్టుడు పుట్టిన ఆ వంశము యొక్క గౌరవము నశించును.
కులములోన నొకఁడు గుణహీనుఁడుండిన
కులము చెడును కాని గుణము వలన
వెలయు జెఱకునందు వెన్ను వెడలి నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: చెరకు గడకు చివర వెన్నులడితే చప్పబారినట్లుగా గుణహీనుడైనవ్యక్తి వలన ఆ కులమంతా చెడిపోవును.
రాముఁడొకఁడు పుట్టి రవికుల మీడేర్చె
కురుపతి జనియించి కులముఁ జెఱచె
ఇలనుఁ బుణ్యపాప మీలాగు గాదొకో
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: రాముని పుట్టుకతో రఘువంశము ఉద్ధరింపబడింది. దుర్యోధనుని పుట్టుకతో కురువంశము నశించింది. ప్రపంచములో పుణ్య పాపములు విధముగానే ఉంటాయి.
హీనగుణమువాని నిలుజేరనిచ్చిన
నెంతవానికైన నిడుము గలుగు
ఈఁగ కడుఁపు జొచ్చి యిట్టట్టు సేయదా
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: నీచుణ్ణి ఇంటిలో పెట్టిన ఎటువంటి వానికైన కష్టము కలుగుతుంది. ఈగ కడుపులోకి వెళితె వికారమును కలిగిస్తుంది.
వేరుపురుగుచేరి వృక్షంబుజెఱచుఁను
చీడ పురుగు జేరి చెట్టుఁజెఱచుఁ
కుత్సితుండు చేరి గుణవంతుఁజెఱచురా
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: వేరువురుగు పెద్ద వృక్షాన్ని పాడుచేస్తుంది. చీడ పురుగు చిన్న చెట్టుని నశింపజేస్తుంది. చెడ్డవాడు గుణవంతుని చేరి అతన్ని నాశనము చేస్తాడు.
హీనుఁడెన్ని విద్యలు నేర్చినఁగాని
ఘనుఁడుఁగాడు హీనజనుఁడె కాని
పరిమళములు మోయ ఖరము తా గజమౌనె
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: నీచుడైన వ్యక్తి ఎంత చదువు చదివినా అతడు గొప్పవాడుకాలేడు. సుగంధ ద్రవ్యములు మోసినంత మాత్రాన గాడిద ఏనుగు కాలేదు.
విద్యలేనివాడు విద్వాంసు చేరువ
నుండగానె పండితుండు గాడు
కొలని హంసలకడ గొక్కెర లున్నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ! 20
భావం: హంసలతో కలిసినంత మాత్రమున కొంగమారనట్లుగా, పండితులతో కలిసినప్పటికి మూర్ఖుడు మారడు.
అల్పజాతి వాని కధికార మిచ్చిన
దొడ్డవారినెల్ల తొలగగొట్టు
చెప్పు తినెడు కుక్క చెరకు తీపెరుగునా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: దుష్టునకు అధికారము నిచ్చిన యెడల మంచి వారందరినీ వెడల కొట్టును. చెప్పుతినెడి కుక్క, చెరకుతీపియేరుగదు.
అల్పుఁ డైన వాని కధిక భాగ్యము గల్గ
దొడ్డవారి దిట్టి తొలగఁ గొట్టు
అల్పబుద్ధి వా డధికుల నెఱఁగునా
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: మూర్ణునికి సంపదగలిగినట్లయితే పెద్ద వారినందరిని తిరస్కరించి తిరుగుతాడు. అల్పుడైన వానికి గొప్ప వారి యొక్క శక్తి గురించి ఏమి తెలుస్తుంది.
ఎద్దుకైనఁగాని యేడాది తెల్పిన
మాట దెలసి నడచు మర్మ మెఱిఁగి
మొప్పె తెలియలేడు ముప్పదేండ్లకునైన
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: ఒక సంవత్సరముపాటు బోధించినట్లెతే ఎద్దుకూడ మర్మములను తెలిసికొని నడుచుకుంటుంది. కాని ముప్ప్తె సంవత్సరాల నేర్పినప్పటికీ మూర్ఖుడు తెలిసికొనలేడు.
ఎలుకతోలుఁదెచ్చి యేడాది యుతికిన
నలుపు నలుపేగాని తెలుపురాదు
కొయ్యబొమ్మను దెచ్చి కొట్టినఁ బలుకునా
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: ఎలుక తోలు ఎంతసేపు ఉతికినప్పటికీ అది తెలుపుగా మారదు. కర్ర్తో చేసిన బొమ్మ ఎంత కొట్టినప్పటికీ మాట్లడదు.
పాము కన్న లేదు పాపిష్టి జీవంబు
అట్టి పాము చెప్పినట్లు వినును
ఖలుని గుణము మాన్పు ఘను లెవ్వరును లేరు
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: పామువంటి పాపిష్టి జీవికూడ ఏదైన చెఊఇన వింటుంది కాని మూర్ఖునికి ఎంత చెప్పిన అతని గుణము మారదు.
వేము పాలువోసి ప్రేమతో బెంచిన
చేదువిరిగి తీపజెందబోదు
ఓగు నోగెగాక యుచితజ్ఞు డెటులౌను
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: వేప చెట్టుకి పాలు పోసి పెంచినప్పటికి చేస్దు విరిగి తీపెక్కదు. అదే విధంగా చెడ్డవాడు చెడ్డవాడే కాని మంచివాడు కాలేడు.
ముష్టి వేపచెట్లు మొదలంట ప్రజలకు
పరగ మూలికకుఁ బనికివచ్చు
నిర్దయాత్మకుండు నీచుఁడెందునకౌను
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: ఎంత పంచదార పోసి వండినప్పటికి పాపరపండ్లలో తీపి ఎక్కడు. అదే విధముగ దోష్టులకు మంచి గుణము అలవడదు.
పాలు పంచదార పాపర పండ్లలోఁ
జాలఁబోసి వండఁ జవికిరావు
కుటిల మానవులకు గుణమేల కల్గురా
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: ఎంత పంచదార పోసి వండినప్పటికి పాపరపండ్లలో తీపి ఎక్కడు. అదే విధముగ దోప్పులకు మంచి గుణము అలవడదు.
పాల నీడిగింట గ్రోలుచునుండెనా
మనుజులెల్లఁగూడి మద్యమండ్రు
నిలువఁదగని చోట నిలువ నిందలు వచ్చు
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: ఈడిగవాని ఇంటిలో పాలు తగినా అవి మద్యమని లోకులు భావిస్తారు. నిలువ గూడని స్థలములో నిలిస్తే అపకీర్తి కలుగుతుంది.
కానివాతోడఁ గలసి మెలఁగుచున్నఁ
గానివానిగానె కాంతు రవని
తాటి క్రింద పాలు ద్రాగిన చందమౌ
విశ్వదాభిరామ! వినుర వేమ! 30
భావం: పనికిరానివానితో తిరిగిన వారిని అందరూ పనికిరానివానిగానే చూస్తారు. తాటిచెట్టు కింద పాలు త్రాగినప్పటికి కల్లు త్రాగినట్లుగానే అందరూ భావిస్తారు.
తామసించి చేయఁదగ దెట్టికార్యంబు
వేగిరింప నదియు విషమెయగును
పచ్చికాయదెచ్చి బడవేయ ఫలమౌన?
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: కోపముతో ఏపనీ చేయకూడదు. అలా చేసినట్లై ఆపని జరగదు. వ్యతిరేకంగా కూడ జరుగుతుంది. పచ్చికాయనుతెచ్చి మూసలో వేసినంత మాత్రాన అది పండు కాదుగదా!
కోపమునను ఘనత కొంచమైపోవును
కోపమును మిగులఁగోడు గలుగుఁ
గోపమడచెనేని గోర్కెలునీడేరు
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: కోపము వలన గొప్పతనము నశించటమే గాక దుఃఖము కలుగుతుంది. కోపమును తగ్గించుకొన్న యెడల అన్ని కోరికలు ఫలిస్తాయి.
నీళ్ళలోన మొసలి నిగిడి యేనుఁగు దీయు
బయట కుక్కచేత భంగపడును
స్థానబలిమిగాని తన బలిమి కాదయా
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: నీటిలో నున్నపుడు మొసలి ఏనుగును కూడ జయింస్తుంది. కాని బయట కుక్కను కూడ ఏమి చేయలేదు. అది స్థానమహిమేకాని తనమహిమకాదు.
నీళ్ళలోన మీను నిగిడి దూరముపారు
బైట మూరుడైన బారలేదు
స్ధానబల్మిగాని తనబల్మి కాదయా
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: నీటిలో స్వేచ్చగ సంచరించే చేప భూమి మీదకు రాగానే చనిపోతుంది. అదిస్థాన మహిమకాని తనమహిమ మాత్రం కాదుకదా!
నీళ్ళమీదనోడ తిన్నగఁబ్రాకు
బైట మూరుడై బారలేదు
నెలవు దప్పుచోట నేర్పరి కొఱగాడు
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: నీటిమీద ఏ ఆటంకము లేకుండ తిరిగి ఓడ భూమి పై ఒక మూరెడు కూడ వెళ్ళలేదు. ఎంత నేర్పరి అయినప్పటికీ తన స్థానము మారిన పనికి రాని వాడవుతాడు.
కులము లేని వాడు కలిమిచే వెలయును
కలిమిలేనివాని కులము దిగును
కులముకన్న భువిని కలిమి ఎక్కువ సుమీ
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: తక్కువ కులము వాడైనప్పటికి ధనమున్నట్లయితే అతడు గౌరవాన్ని పొందును. ధనము లేనట్లయితే ఉన్నత కులస్థుడు కూడ రాణింపదు. కాబట్టి కాలముకంటే ధనము ఎక్కువ.
కులము గలుగువాఁడు గోత్రంబు గలవాఁడు
విద్యచేత విఱ్ఱవీగువాఁడు
పసిడి గలుగువాని బానిస కొడుకులు
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: మంచి కులము గలవాడు, మంచి గోత్రముకలవాడు, చదువు కలిగిన వాడు బంగారము గలవానికి బానిసలవు అవుతారు. లోకములో ధనమే ప్రధానము.
కనియు గానలేఁడు కదలింపఁడా నోరు
వినియు వినగలేడు విస్మయమున
సంపద గలవాని సన్నిపాతంబిది
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: ధనమున్నవాడు సన్నిపాత రోగం వచ్చిన వచ్చినవలె ఎవరైన తనని చూచిన చూడనట్లుగా, వినినప్పటికీ విననట్లుగా నటిస్తాడు.
ఏమి గొంచువచ్చె నేమితాఁ గొనిపోవుఁ
బుట్టువేళ నరుడు గిట్టువేళ
ధనము లెచటికేగు దానెచ్చటికినేగు
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: మనిషి పుట్టీంపుడు తన కూడ తీసికొని రాలేదు. చనిపోయినప్పుదు కూద ఏమి తీసికొని వెళ్ళలేడు తానెక్కదికిపోతడో, సంపదలు ఎక్కడికి పోతాయో తెలియక లోభియై గర్వించటం వ్యర్ధము.
తనువ దెవరి సొమ్ము తనదని పోషించి
ద్రవ్య మెవరిసొమ్ము దాచుకొనcగ
ప్రాణ మెవరిసొమ్ము పారిపోవక నిల్వ
విశ్వదాభిరామ! వినుర వేమ! 40
భావం: తనస్వంతమని పోషించుటకు ఈ సరీరము ఎవరిదీకాదు. దాచినపెట్టుటకు ధనము ఎవరిదీకాదు. పారిపోకుండ నిలుచుటకు ఈ ప్రాణము ఎవరిదీకాదు. ఇవి ఏమియు శాశ్వతములు కావు.
గొడ్డుటావు బదుక గుండ గొంపోయిన
పాలనీక తన్ను పండ్లురాల
లోభివాని నడుగ లాభంబు లేదయా
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: గొడ్డు బోతైన ఆవు దగ్గరకి పాలుపితకటానికి కుండను తీసికొనివెళ్తే పండ్లు రాలేటట్టు తన్నుతుంది కాని పాలు ఇవ్వదు అదే విధముగా లోభిని యాచించటం కూడ వ్యర్థము.
మేక కుతికబట్టి మెడచన్ను గుడవంగ
ఆఁకలేల మాను ఆశగాక
లోభివాని నడుగ లాభంబు లేదయా
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: మేక మెడకిందనున్న చన్నులను కుడిచిన పాలు దొరకవు. ఇదే రీతిగాలోభిని యాచించిన ప్రయోజనముండదు.
పెట్టిపోయలేని వట్టి నరులు భూమిఁ
పుట్టనేమి వారు గిట్టనేమి
పుట్టలోనఁ జెదలు పుట్టవా గిట్టవా
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: ఎదుతి వారికి సహాయము చేయనివాడు పుట్టినా చచ్చినా ఒకటే. పుట్టలో చెదలు పుట్టినా, చచ్చినా ఒకటే కదా!
ఆశచేత మనుజు లాయువు గలనాళ్ళు
తిరుగుచుండ్రు భ్రమను ద్రిప్పలేక
మురికి భాండమందు ముసుగు నీగల భంగి
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: ఆయువు ఉన్నంత కాలము మనుష్యులు ఆశ వదలలేక కాలము గడుపుచుందురు. మురికి కుండలో ఈగలు ముసిరినట్లే వారు సంచరించుదురు.
నీళ్ళలోని చేప నెరి మాంస మాశకు
గాల మందు చిక్కి గూలినట్లు
ఆశ బుట్టి మనుజు డారీతి చెడిపోవు
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం:
ఆశ పాపజాతి యన్నింటికంటెను
ఆశచేత యతులు మోసపోరె
చూచి విడుచువారె శుద్ధాత్ములెందైన
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: ఆశ చాలా పాపమయినది. అశచే మునులు సహితము చెడిపోయిరి. ఆ ఆశను విడిచినవారే నిష్కల్మషమయిన మనసు గలవారు.
అన్నిదానములను నన్నదానమె గొప్ప
కన్నతల్లికంటె ఘనములేదు
ఎన్న గురునికన్న నెక్కుడులేదయా
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: అన్ని దానములకంటె అన్నదానము గొప్పది. కన్నతల్లి కంటె మించినదిలేదు. గురువుకంటె గొప్పదిలేదు.
ఆశకోసి వేసి యనలంబు చలార్చి
గోఁచి బిగియగట్టి గుట్టు దెలసి
నిలిచి నట్టివాఁడె నెఱయోగి యెందైన
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: ఆశ వదలి, ఆశలను అగ్ని చల్లార్చుకొని, కామమువదలి గోచిబిగించి కట్టి, జ్ఞానము తెలుసుకొనువాడే నేర్పరియైన యోగి.
కనకమృగము భువిని గద్దు లేదనకను
తరుణి విడిచి చనియె దాశరధియు
తెలివిలేనివాడు దేవుడెట్లాయెరా
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: భూమిపై బంగారులేళ్ళు వున్నవో లేవో అని ఆలోచింపకయే శ్రీరాముడు భార్యను విడచి ఆ లేడి వెంటబడెను. ఆ మాత్రము తెలుసుకొన లేనివాడు దేవుడెట్లయ్యెను?
చచ్చిపడిన పశువు చర్మంబు కండలు
పట్టి పుఱికి తినును పరగ గ్రద్ద
గ్రద్ద వంటివాడు జగపతి కాడొకో
విశ్వదాభిరామ! వినురవేమ! 50
భావం: గ్రద్ద చనిపోయిన పశువుయొక్క చర్మమును, కండలను ఊడబెరికి తినును, ఈ రాజులును ఆ గ్రద్దవంటివారే కదా.
ఆలను బుగ్గ పుట్టినప్పుడే క్షయమౌను
గలలఁ గాంచులక్ష్మి గనుటలేదు
ఇలను భోగభాగ్య మీతీరు గాదొకో
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: కెరటములో బుట్టిన బుడగలు అప్పుడే నిశించును. కలలోకనబడులక్ష్మిని పొందలేము. ఈభూమిలో భోగభాగ్యములుకూడా ఇట్టివేకదా!
కోతి నొనరదెచ్చి కొత్త పుట్టము గట్టి
కొండముచ్చులెల్ల గొలిచినట్లు
నీతిహీనునొద్ద నిర్భాగ్యుడుండుట
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: కొండముచ్చులు కోతిని తెచ్చి, క్రొత్తవస్త్రమునట్టి పూజించినట్లే నిర్భాగ్యులు గుణము లేనివారిని కొలుచుచుందురు.
కల్లలాడువాని గ్రామకర్త యరుగు
సత్యమాడువాని స్వామి యరుగు
బెక్కుతిండపోతుఁబెండ్లా మెరుంగురా
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: అబద్ధమాడు వానిని గ్రామపెద్ద తెలుసుకొనును. సత్యవంతుని భగవంతుడు తెలుసుకొనును. తిండిపోతుని భార్య యెరుగును.
కల్ల నిజమెల్ల గరకంఠు డెరుగును,
నీరు పల్లమెరుగు నిజముగాను
తల్లితానెరుగు తనయుని జన్మంబు
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: నీరు పల్లమెరుగును, సత్యము అసత్యము భగవంతుడు తెలుసుకొనును. కుమారుని పెట్టుక తల్లికే తెలుసును.
మైలకోకతోడ మాసినతలతోడ
ఒడలు మురికితోడ నుండెనేమి
అగ్రకులజుఁడైన నట్టిట్టు పిల్వరు
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: మాసిన చీరతోను, మాసినతలతోను, మురికిగాయున్న శరీరముతోనువున్నచో గొప్పకులమునందు బుట్టినవారినయినను హినముగాచూతురు.
ఉప్పులేనికూర హీనంబు రుచులకు
పప్పులేని తిండి ఫలములేదు
యప్పులేనివాడె యధిక సంపన్నుండు
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: ఉప్పులేని కూర రుచిగావుండదు. పప్పులేని భోజనము బలవర్ధకముకాదు. అప్పులేనివాడే ధనవంతుడు.
చెట్టుపాలు జనులు చేదందు రిలలోన
ఎనుపగొడ్డు పాలదెంత హితవు
పదుగురాడుమాట పాటియై ధరజెల్లు
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: ఈ ప్రపంచములో జనులు చెట్లపాలు మంచివి గావందురు. గేదెపాలు వారికి హితముగా నుండును. ఈ ప్రపంచములో పదిమందీ ఆడుమాటయే చెల్లును.
పట్టుపట్టరాదు పట్టి విడువరాదు
పట్టేనేని బిగియ బట్టవలయు
బట్టివిడుచుకన్న బరగ జచ్చుటమేలు
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: పట్టుదలయే వహింపరాదు. వహించినచో ఆ పట్టు వదలరాదు. పట్టినపట్టు నడిమిలోనే విడచుటకంటే మరణము మేలు.
తప్పులెన్నువారు తండోపతండంబు
లుర్విజనులకెల్ల నుండు తప్పు
తప్పులెన్నువారు తనతప్పులెరుగరు
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: ఇతరుల తప్పులను పట్టుకొనువారు, అనేకులు గలరు. కాని తమ తప్పులను తాము తెలుసుకొనలేరు.
అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వధాభిరామ! వినుర వేమ! 60
భావం: తరచుగ పాడుచుండిన కంఠధ్వని మాధుర్యముగ నుండును. ప్రతిదినము తినుచుండిన వేపవేరైనను తియ్యగ నుండును. ప్రయత్నము చేయచుండిన పనులు నేరవేరును. ఈ ప్రపంచమున పద్ధతులు యీ విధముగ ఉండును.
తమకుగల్గు పెక్కు తప్పులునుండగా
ఓగు నేరమెంచు నొరులగాంచి
చక్కిలంబుగాంచి జంతిక నగినట్లు
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: తనయందు అనేక్ తప్పులు పెట్టుకొని, దుర్మార్గులు ఇతరుల తప్పులను యెన్నుచుదురు. చక్కిలమునుచూచి జంతిక నవ్వినట్లు వుండును కదా!
ఇనుము విరిగె నేని యిరుమారు ముమ్మారు
కాచి యతుకవచ్చు క్రమముగాను
మనసు విరిగెనేని మరియంట నేర్చునా
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: ఇనుము విరిగిన కాల్చి, అతుకవచ్చును, మనసు విరిగినచో మరల అంటీంచుట ఎవరితనము కాదు.
ఒరుని చెరచదమని యుల్లమం దెంతురు
తమకుచే టెరుగని ధరణి నరులు
తమ్ము జెఱచువాడు దేవుడు లేడొకో
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: ఇతరులను పాదుచేయవలెయునని కొందరు ఆలోచనచేయుదురు. కాని, తమకు కలుగు ఆపదలను గ్రహింపలేరు. ఒకరిని పాదుచేయ వలయుననిన, భగవంతుడు వారినే పాడుచేయును.
కానివాని చేతగాసు వీసంబిచ్చి
వెంటదిరుగువాడె వెఱ్రివాడు
పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకునా
విశ్వదాభిరామ! వినురవేమ.
భావం: దుర్మార్గుని చేతికి ధనముయిచ్చి, దానికై మరల అతని వెంట తిరుగుట తెలివితక్కువతనము. పిల్లిమ్రింగినకోడి పిలిచిననూ పలుకదుకదా.
మాటలాడనేర్చి మనసు రాజిలజేసి
పరగఁ బ్రియము చెప్పి బడలకున్న
నొకరి చేత సొమ్ము లూరక వచ్చువా
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: ఇతరులకు సంతోషము కలుగునట్లు మాటలాదు విధానము నేర్చుకొని వారి మనస్సు ఆనందపరచి, శ్రమపడకుండ వారి నుండి చేతిలో సొమ్ము తేరగనే రాదు.
చంపదగినయట్టి శత్రువు తనచేత
జిక్కెనేని కీడు సేయరాదు
పొసగ మేలు చేసి పొమ్మనుటె చాలు
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: చంపదగినట్టి శత్రువు తన చేతిలో చిక్కిననూ, అపకారము చేయక, దగిన ఉపకారమునే చేసి విడిచిపెట్టుట మంచిది.
వాన గురియకున్న వచ్చును క్షామంబు
వాన గురిసెనేని వరదపారు
వరద కరవు రెండు వలసతో నెరుగుడీ
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: వానగురియనచో కరువు వచ్చును, వానకురిసిన వరద వచ్చును. వరదా కరువూ రెండునూ కదాని వెంటా మరియెకటి వచ్చునని తెలుసుకొనవలెను.
పుట్టిన జనులెల్ల భూమిలో నుండిన
పట్టునా జగంబు వట్టిదెపుడు
యముని లెక్క రీతి అరుగుచు నుందురు
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: పుట్టిన వారందరూ మరణించనిచో యీ భూగోళము పట్టదు. యమునిలెక్క ప్రకారము ఒకరి తరువాత ఒకరుచనిపొవుచునే యుందురు.
వాన రాకడయును బ్రాణాంబు పోకడ
కానబడ దదెంత ఘనునికైన
కానపడిన మీద కలియెట్లు నడచురా
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: ఈ కలియుగములో వానరాకడ, ప్రాణము పోకడ ముందుగా యెవరునూ తెలుసుకొనలేరు. ఇది కలియుగ ధర్మము.
చిప్పబడ్డ స్వాతిచినుకు ముత్యంబాయె
నీటిబడ్డ చినుకు నీటఁగలిసె
బ్రాప్తిగల్గుచోట ఫలమేల తప్పురా
విశ్వదాభిరామ! వినురవేమ! 70
భావం: స్వాతికార్తిలో ముత్యపు చిప్పలో పదినచినుకు ముత్యమగును నీటబదినది నీటిలో కలిసిపోవును. ప్రాప్తించుచోట ఫలము తప్పదు.
ఎన్నిచోట్లు తిరిగి యేపాట్లు పడినను
అంటనియ్యక శని వెంటదిరుగు
భూమి క్రొత్తలైన భుక్తులు క్రొత్తలా
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: ఎన్నిచోట్ల తిరిగి ఎన్ని కష్తములు పడినను, లాభము కలుగునీయక శని వెంటాడి తిరుగుచుండును. తమ ప్రదేశము క్రొత్తదైననూ, తినువారు క్రొత్తవారు కాదుగదా.
కర్మ మధికమై గడచి పోవగరాదు
ధర్మరాజు దెచ్చి తగని చోట
గంకుబటుఁ జేసిఁ గటకటా దైవంబు
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: పూర్వజన్మమున చేసిన కర్మ అనుభవింఒపక తప్పదు. ధర్మరాజు వంటివాడు. ఒక సామాన్యమైన చిన్నరాజు దగ్గర కొంతకాలము కంకుభట్టుగా వుండెను.
అనువుగాని చోట అధికుల మనరాదు,
కొంచెముండుటెల్ల కొదువ కాదు
కొండ అద్దమందు కొంచమై యుండదా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: విలుగానిచోట అధికుదనని సంచరించరాదు. సామాన్యముగనుండుట నీచముగాదు. అద్దములో కొంత చిన్నదిగ కంపించిననూ అసలు చిన్నది కాదుగకా.
ఇమ్ము దప్పువేళ నెమ్మెలన్ని యుమాని
కాలమొక్కరీతి గదపవలయు
విజయ డిమ్ము దప్పి విరటుని గొల్వడా
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: చెడ్డకాలము వచ్చినపుదు భోగములన్నియు వదులుకొని సామాన్యముగ కాలము గడుపవలయును. అర్జునుడు రాజ్యము పోగొట్టుకొని విరాటరాజు కొలువులో చేరెనుగదా.
చిక్కియున్ననేళ సింహబునైనను
బక్కకుక్క కరచి బాధచేయు
కలిమిలేనివేళఁ బంతంబు చెల్లదు
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: బలము బలము లేనప్పుదు సింహమునైనను బక్కకుక్క కరచి బాధపెట్టును. సక్తిలేనప్పుడుపంతంములకుపోకతలవంచుకొని తిరుగుటమంచిది.
లక్ష్మి యేలినట్టి లంకాధిపతి పురి
పిల్ల కోతి పౌజు కొల్ల పెట్టెఁ
జేటు కాలమయిన జెఱుప నల్పులె జాలు
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: గొప్ప ధనవంతుదైన రావణుని లంకను సామాన్యమైన కోతులు నాసనము చేసెను. చెడ్డకాలము వచ్చినప్పుదు సామాన్యులైనను అపకారము చేయుదురు.
మొదట ఆశపెట్టి తుదిలేదుపొమ్మను
పరలోభులైన పాపులకును
ఉసురు తప్పకంటు నుండేలు దెబ్బగా
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: మొదట ఉపకారము చేసెదననిచెప్పి, త్రిప్పిత్రిప్పి తరువాత పొమ్మను లోభులకు, అపకారము వుండేలు దెబ్బవలె తప్పక తగులును.
ఇచ్చువానియొద్ద నీయని వాడున్న
ఇచ్చుగాని యీవి సాగనీడు
కల్పతరువు క్రింద గచ్చ చెట్టున్నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: దాతదగ్గర లోభిచేరినచో, చచ్చినను ధర్మము, పరోపకారము చేయనీయుడు. సకల కోరికలనిచ్చు కల్పవృక్షము క్రింద ముండ్లపొదవుండినచో కల్పవృషము దగ్గరకు పోనీయదుగదా.
అరయ నాస్తియనక యడ్డుమాటాడక
పట్టుపడక మదిని దన్ను కొనక
తనది గాదనుకోని తాబెట్టునదె పెట్టు
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: ఆలోచింపగా, లేదనక అడ్డుచెప్పక తట్టుపడక మనస్సులో "యీయనా ? వద్దా ! అని ఆలోచింపక తనది కాదని ఇతరులకు పెట్టుటే మంచిదే.
ధనము కూడబెట్టి దానంబు చేయక
తాను దినక లెస్స దాచుకొనగ
తేనె టీగ గూర్చి తెరువరి కియ్యదా
విశ్వదాభిరామ! వినురవేమ! 80
భావం: ధనము సంపాదించి, దానమీయక, తాను తినక, దాచుకొనుట, తేనెటీగ తేనెను ప్రోగుచేసి బాటసారికి యిచ్చునట్లుగనే ఇతరుల పాలు చేయుట అగును.
కొంకణంబు పోవఁ గుక్క సింహము కాదు
కాశి కరుగఁ బంది గజము కాదు
వేరుజాతి వాడు విప్రుండు కాలేడు
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: కేరళ దేశము పోయిననూ కుక్క సింహము కాలేదు. కాశీకి పోయినను పంది యేనుగు కాలేదు. ఇతర కులము వారు బ్రహ్మణులు కాలేరు.
తవిటి కరయ వోయ దండులంబులగంప
శ్వాన మాక్రమించు సామ్యమగును
వైశ్వవరుని సొమ్ము వసుధ నీచుల కబ్బు
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: తవుడును చూచుటకు బోవగా బియ్యము గంప కుక్క తినివేసినట్లుగ, వైశ్యునిసొమ్ము నీచుల పాలగు చుండును.
దాత కాని వాని దరచుగా వేఁడిన
వాఁడు దాత యౌనె వసుధలోన
ఆరు దర్భయౌనె యబ్ధిలో ముంచినా
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: దాతృత్వము లేనివానిని యెన్ని సార్లు అడిగినను యేమియు లాభములేదు. సముద్రములో ముంచిననూ అవురుగడ్డి దర్భగాదు.
పరగ రాతి గుండు పగుల గొట్ట వచ్చు
కొండలన్ని పిండి కొట్టవచ్చు
కట్టినచిత్తు మనసు కరిగింపగారాదు
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: రాతి గుండు పగులగొట్టవచ్చును. కొండలన్నియు డండిగొట్ట వచ్చును. కఠిన హృదయుని మనసు మాత్రము మార్చలేము.
వంపుకర్రగాల్చి వంపు దీర్పగవచ్చు
కొండలన్ని పిండి గొట్టవచ్చు
కఠినచిత్తు మనసు కరిగింపగరాదు
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: వంకరగా నువ్నె కర్రను కాల్చి దాని వంపు తీయవచ్చును. కొండ లన్నిటినీ పిండిగొట్ట వచ్చును. కాని కఠిన హృదయము మనసు మాత్రము మార్చలేము.
విత్తముగలవాని వీపు పుండైనను
వసుధలోన జాల వార్తకెక్కు
బేద వానియింట బెండ్లయిననెరుగరు
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: ధనవంతుని వీపుపై పుండు పుట్టినను, ఆ విషయమును లోకములో అందరును చెప్పుకొందురు. పేదవాని యింటిలో పెండ్లి అయినను చెప్పుకొనరు.
ఆపదల వేళ బంధులరసిజూడు
భయమువేళ జూడు బంటుతనము
పేదవేళ జూడు పెండ్లాము గుణమును
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: కష్టములు కలిగినప్పుడు బంధువులు దగ్గరకు పోయిపరిశీలిపపుము, భయము కలిగినప్పుడు, ధైర్యమును పరీక్షింపుము. దరిద్రముగా వున్నప్పుడు భార్యగుణము పరీక్షింపుము.
ఆలిమాటలు విని అన్నదమ్ములబాసి
వేఱె పొవువాడు వెఱ్రివాడు
కుక్క తోకబట్టి గోదావ రీదునా
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: భార్యమాటలు విని అన్నదమ్ములను వదలిపోవుట అజ్ఞానము కుక్కతోక పట్టుకొని గోదవరి ఈదుట అసాధ్యము అనితెలుసుకొనుము.
మగని కాలమందు మగువ కష్టించిన
సుతుల కాలమందు సుఖమునందు
కలిమి లేమి రెండు గల వెంతవారికి
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: భర్తకాలములో కష్టపడి గృహమును కాపాడినచో, కొడుకులు పెద్దవారైనప్పుడు సుఖపడ వచ్చును. ఎంతవారికైననూ కలిమి, లేమి రెండునూ జీవితములో వచ్చుచుండును.
చెప్పులోని రాయి చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు కాలిముల్లు
ఇంటిలోనిపోరు నింతింత గాదయా
విశ్వదాభిరామ! వినురవేమ! 90
భావం: చెప్పులో ఉన్నరాయి, చెవిలో దూరిన జోరీగ, కంటొలోపడిన నలసు కాలిముల్లు, ఇంటిలోని జగడం వెంటనే తగ్గక చాలా బాధిస్తాయి.
తల్లిదండ్రి మీద దయ లేని పుత్రుండు
పుట్టనేమి? వాడు గిట్టనేమి?
పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: తల్లిదండ్రులపై ప్రేమ లేని పుత్రుడు పుట్టినా చనిపోయినా నష్టములేదు. పుట్టలో చెదలు పుడుతూ ఉంటాయి. నశిస్తూ ఉంటాయి.
తనకు లేనినాడు దైవంబు దూరును
తనకు గల్గెనేమి దైవమేల?
తనకు దైవమునకు దగులాట మెట్టిదో
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: మనిషి తనకు లేనప్పుడు దేవుని దూషిస్తాడు. ఉన్నప్పుడు దేవుని మరచిపోతాడు. ఇదే మనిషికి దేవునికి సంబంధమై ఉంటుందేమోకదా!
మాటలాడు నొకటి మనసులోన నొకటి
ఒడలి గుణము వేరె యోచన వేరె
ఎట్లుగల్గు ముక్తి యీలాగు తానుండ
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: మనసులో ఉన్నది ఒకటి, పైకి మాటాదేది మరొకటి. తన గుణము ఒకటి, అలోచన వేరొకటి ఉన్నవానికి మోక్షము దొరకదు.
మ్రుచ్చు గుడికి పోయి ముడివిప్పునే కాని
పొసగ స్వామిజూచి మ్రొక్కడతడు
కుక్క యిల్లుసొచ్చి కుండలు వెదుకదా
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: ఇంటిలో ప్రవేశించిన కుక్క కుండలు వెదనుకునట్లుగ గదిలోకి వచ్చిన దొంగ ధనము కొరకు వెదుకునుగాని దేవునికిమ్రొక్కడు.
అంతరంగమందు సపరాధములు చేసి
మంచివానివలెను మనుజు డుండు
ఇతరు లెరుగకున్న నీశ్వరుఁ డెరుంగడా
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: మనిషి చాటు మాటూగ అనేక తప్పుచేసి ఇతరుల ఎదుట మంచివాడుగా నటించవచ్చును. కాని సర్వము తెలిసిన భగవంతుడు మనిషి చేసిన తప్పులనుగుర్తిస్తాడు.
వేషభాష లెరిగి కాషాయవస్త్రముల్
గట్టగానె ముక్తి గలుగబోదు
తలలు బోడులైన తలుపులు బోడులా
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: వేష భాషలు నేర్చుకొని కాషాయ బట్టలు కట్టినంత మాత్రాన మోక్షమురాదు. తలలు చేసినంత మాత్రాన అతని మనసు బోడిది కాదుకదా!
ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని
భావమిచ్చి మెచ్చు బరమలుబ్ధు
పంది బురద మెచ్చు బన్నీరు మెచ్చునా
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: మూర్ఖుణ్ని మూర్ణుడే మెచ్చుకొంటాడు. అజ్ఞానియైన వాడు లోభివానినే మెచ్చుకుంటాడు. పంది బురదనే కోరుకుంటుంది. కాని పన్నీరును కోరుకోదు.
గాజుకుప్పెలోన గడఁగుచు దీపంబ
దెట్టు లుండు జ్ఞాన మట్టులుండు
దెలిసినట్టి వారి దేహంబులందును
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: గాజు బుడ్డిలో ఏవిధముగా దీపము నిలకడతో వెలుగుతుందో అదే విధముగ తెలివిగల వారియండు జ్ఞాన దీపము ప్రవేశిస్తుండి.
అన్న మిడుటకన్న అధిక దానంబుల
నెన్ని చేయనేమి యేన్నఁబోరు
అన్న మెన్న జీవనాధార మగునయా
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: ఇతర దానములు ఎన్ని చేసిననూ అన్నదానముతో సాటిగావు. లేలోచించినచో అన్నమే యీ లోకములో జీవనాధారము.
ఇహరంబులకును నిది సాధనంబని
వ్రాసి చదివిన విన్నవారికెల్ల
మంగళంబు లొనరు మహిలోన నిది నిజము
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: ఈ లోక మందును, పరలోక మందును గూడసుఖపడుటకు మార్గముగ, నుందునని ఈ శతకము వ్రాసితిని. దీనిని చదివిన వారికిని విన్నవారికిని శుభములు కలుగును. ఇది నిజము.